అతి తక్కువ సమయంలోనే మెగా కుటుంబానికి దగ్గరైపోయాడు సురేందర్ రెడ్డి. బన్నీతో `రేసుగుర్రం`, రామ్ చరణ్‌తో `ధృవ` తీసి హిట్లు కొట్టిన సూరి - చిరంజీవితో `సైరా` తెరకెక్కించి మెగా ఫ్యాన్స్‌కి ఇష్టమైన దర్శకుడిగా మారిపోయాడు. అయితే తాను ఇప్పటి వరకూ తీసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, సైరా మరో ఎత్తు అంటున్నాడు సూరి. ఈ సినిమా కోసం చిరంజీవితో పనిచేస్తున్నప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నానని, వ్యక్తిగానూ మారానని అంటున్నాడు.
''చిరంజీవికి కోట్లాదిమంది అభిమానులున్నారు. అందులో ఓ అభిమాని చాలా ప్రత్యేకం. ఆ అభిమాని ఎవరో కాదు. చిరంజీవిగారే. మెగాస్టార్‌ని చిరంజీవి అనే అభిమాని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. తనలో ఉన్న అభిమానిని సంతృప్తిపరచడానికి ఆయన ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు. ఆ అభిమానికి నచ్చకుండా చిరు ఏ పనీ చేయరు. ఇన్నేళ్లు వచ్చినా వృత్తిపై అంకితభావం తగ్గలేదు. సెట్లో నిత్య విద్యార్థిలాం ఉంటారు. దర్శకుడికి ఏం కావాలో అది చేస్తారు. నా పనిలో ఆయన ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. దర్శకుడికి అంత విలువ ఇస్తార''ని చెప్పుకొచ్చాడు సూరి. అక్టోబరు 2న సైరా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.