ఒకప్పుడు షూటింగ్ అంటే ఉదయం ఏడింటికల్లా ఫస్ట్ షాట్ తీయాల్సిందే. ఆరింటికి సెట్లో అందరూ హాజరైపోయేవారు. దర్శకుడు, హీరోలతో సహా. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పదైనా తొలి షాట్ పూర్తవ్వడం లేదు. సెట్లో చాలా కాలయాపన జరుగుతోంది. అయితే ఈ పద్ధతి మారాలంటున్నారు చిరంజీవి. ఉదయం ఏడింటికల్లా తొలి షాట్ తీస్తే... చాలా వెసులుబాటు ఉంటుందని, సమయాన్ని సద్వినియోగ పరచుకుంటే చాలా డబ్బులు మిగులుతాయని అంటున్నారు.
ఓ సినిమా కోసం 180 రోజులు 200 రోజులు కష్టపడడం అనవసరమని, అదే క్వాలిటీతో 90 రోజుల్లో సినిమా పూర్తి చేయొచ్చని, ఆ విధంగా ప్రతీ హీరో ఎక్కువ సినిమాలు చేసుకుంటూ వెళ్తే.. టర్నోవర్ పెరుగుతుందని సూచిస్తున్నారు చిరు. `సైరా` షూటింగ్ ఉదయం ఏడంటే.. ఏడింటికే మొదలయ్యేదట.
బ్రేక్‌ఫాస్ట్, లంచ్ బ్రేకులూ చాలా స్పల్పమేనని, ఎక్కడా వృథా లేకుండా జాగ్రత్త పడ్డామని చిరు చెబుతున్నాడు. ఈ సలహా పాటించదగినదే. ఇప్పటి స్టార్ హీరోలకు అత్యవసరం కూడా. యేడాదికి ఒక్క సినిమాకే పరిమితమయ్యే హీరోలు, మరో సినిమా చేయగలిగితే... టాలీవుడ్ టర్నోవర్ విపరీతంగా పెరుగుతుంది. నిర్మాతలు, థియేటర్లు, దాన్ని నమ్ముకుని బతికేవాళ్లూ బాగుపడతారు. మరి... చిరు సలహాని ఎంతమంది పాటిస్తారో చూడాలి.