తెలుగు తెరపై కొత్త సినిమాల ఉధృతి కొనసాగుతూనే ఉంది. ప్రతీ వారం రెండు మూడు సినిమాలు వస్తూనే ఉన్నాయి. దాంతో కొత్త తరహా కథల్ని చూసే అవకాశం దక్కుతోంది. ఈ వారం రెండు చిత్రాలొచ్చాయి. ఒకటి గ్యాంగ్ స్టర్ తరహా యాక్షన్ సినిమా అయితే, మరోటి పరిపూర్ణ థ్రిల్లర్. మరి ఈ రెండు సినిమాలు ఎలా ఉన్నాయి? వీటికి ప్రేక్షకులు ఇచ్చిన తీర్పేంటి? విమర్శకులు ఏమన్నారు? బాక్సాఫీసు వసూళ్లు ఎలా ఉన్నాయి? ముందుగా 'రణరంగం' గురించి చెప్పుకోవాలి. శర్వానంద్ నటించిన సినిమా ఇది. తన పాత్ర రెండు షేడ్స్‌లలో ఉంటుంది. శర్వా సినిమా అనగానే చాక్లెట్ బోయ్ ఇమేజ్ ఉన్న పాత్రలే గుర్తుకు వస్తాయి.
అందుకు విభిన్నమైన ప్రయత్నం చేశాడు ఈ సినిమాలో. నడి వయస్కుడైన గ్యాంగ్ స్టర్‌గా కనిపించాడు. తన వయసుకు మించిన పాత్రని చేశాడు. ఓ విధంగా శర్వాకు ఇటువంటి పాత్రలు అలవాటైపోయాయి. అందుకే ఈసారీ... ఈజీగానే నటించేశాడు. టెక్నికల్ వాల్యూస్ భారీగా నిండిపోయిన ఈ సినిమాలో కథేం లేకపోవడంతో దెబ్బకొట్టేసింది. స్క్రీప్లే కూడా ప్రేక్షకుల్ని కాస్త గందరగోళానికి గురి చేసింది. విమర్శకులు ఈ సినిమాని బిలో యావరేజ్ సినిమాగా తేల్చేశారు. అయితే తొలి రోజు మంచి వసూళ్లే వచ్చాయి. శర్వా గత చిత్రాల కంటే ఎక్కువ మొత్తం కలక్షన్లు రాబట్టింది. రెండో రోజూ స్డడీగానే ఉన్నాయి.
అయితే... బాక్సాఫీసు దగ్గర ఈ నిలకడ ఎన్ని రోజులు అనేది తేలాల్సివుంది. శర్వా మార్కెట్ కి మించి ఖర్చు పెట్టడం వల్ల - బడ్జెట్ ఫెయిల్యూర్‌గా మిగిలిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇక థ్రిల్లర్ చిత్రాల స్పెషలిస్టుగా పేరొందిన అడవి శేష్.. 'ఎవరు' సినిమాతో సందడి చేశాడు. రెజీనా, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ఇది. కథలోని మలుపులు, సాంకేతిక హంగులు కలసి రావడంతో - ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర మంచి రిపోర్ట్ తెచ్చుకుంది. రివ్యూలూ బాగానే రావడంతో - వసూళ్లు పెరిగాయి. తొలి రెండు రోజుల్లో సగానికి పైగా బడ్జెట్‌ని తిరిగి దక్కించుకోగలిగింది. శాటిలైట్, డిజిటల్ రూపంలోనూ మంచి రేటే వచ్చింది.
ఈ హిట్టుతో అడవిశేష్ స్థానం మరింత బలపడిపోయింది. మల్టీప్లెక్స్ లలో 'రణరంగం' కంటే... 'ఎవరు' సినిమాకే ఎక్కువ వసూళ్లు దక్కాయి. ఈనెల 30న 'సాహో' వస్తోంది. సాహోకి పోటీగా సినిమాలు విడుదల చేయడానికి మన దర్శక నిర్మాతలు భయపడుతున్నారు. సాహో వెళ్లిన తరవాతే... మరలా కొత్త సినిమాల హంగామా మొదలవుతుంది. ఈలోగా ఈనెల 23న 'కౌసల్య కృష్ణమూర్తి - ది క్రికెటర్' అనే సినిమా విడుదల అవుతోంది. ఆ సినిమా జాతకం ఎలా ఉంటుందో చూడాలి.