ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు చిరంజీవి కూడా ఎన్టీఆర్ లా ఓ రాజకీయ విప్లవం తీసుకొస్తారనుకున్నారంతా. కానీ... చిరు ప్రభావం 18 స్థానాలకే పరిమితం అయ్యింది. సినిమాలో నెంబర్ వన్‌గా వెలుగొంది, రాజకీయాల్లో జీరో అవ్వడం చిరుకి నచ్చలేదు. దాంతో క్రమంగా రాజకీయాలకు దూరంగా జరిగి, సినిమాలకు మళ్లీ దగ్గరయ్యారు. అయితే ఇటీవల చిరు రాజకీయ పునః ప్రవేశంపై వార్తలు, ఊహాగానాలు ఎక్కువయ్యాయి.
చిరంజీవి బీజేపీలో చేరతారని కొందరు. జనసేన పగ్గాలు చేపడతారని ఇంకొందరు చెప్పుకున్నారు. అయితే చిరు ఉద్దేశ్యాలు పూర్తిగా వేరుగా ఉన్నాయి. ఆయన రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేశారని తెలుస్తోంది. ఇటీవల ఓ ప్రధాన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరు మాటల్ని బట్టి చూస్తే, రాజకీయాలపై ఆయనకు ఎలాంటి ఆసక్తి లేనట్టు అర్థమవుతోంది. రాజకీయాల్లో ఎదుర్కున్న ఒడిదుడుకులు ఆయన్ని పూర్తిగా కలచి వేసినట్టు తెలుస్తూనే ఉంది.
కుటుంబ సభ్యులు కూడా రాజకీయాల్లో రీ ఎంట్రీకి అడ్డు చెబుతున్నారని టాక్. మరోవైపు సినిమాలు,కథలూ అంటూ బిజీగా ఉన్నారు. అందుకే ఆయన రాజకీయాలపై విముఖత చూపిస్తున్నారు. చిరు రాజకీయ ఛాప్టర్ పూర్తిగా క్లోజ్ అయినట్టే అని సినీ, రాజకీయ విశ్లేషకులు కూడా జోస్యం చెబుతున్నారు.