కంత్రి, బిల్లా లాంటి సినిమాలు తీసిన మెహర్ రమేష్ గుర్తున్నాడు కదా? శక్తి, షాడో లాంటి డిజాస్టర్లు ఇచ్చి, కనుమరుగైపోయాడు. షాడో తరవాత మరో సినిమా చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు మెహర్. కానీ అవేం వర్కవుట్ అవ్వలేదు. ఎట్టకేలకు ఇప్పుడు మళ్లీ మెగా ఫోన్ పట్టబోతున్నాడు. అయితే సినిమా కోసం కాదు, వెబ్ సిరీస్ కోసం. వెబ్ సిరీస్ మీడియా ఇప్పుడు ఉధృతంగా నడుస్తోంది. అగ్ర నిర్మాణ సంస్థలు కూడా వీటిపై దృష్టి పెట్టాయి.
ఇప్పుడు నమ్రత శిరోద్కర్ కొన్ని వెబ్ సిరీస్‌లు చేయడానికి ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా మెహర్ రమేష్ తో ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేసిందినమ్రత. ఈ సిరీస్‌లో జగపతిబాబు లీడ్‌గా కనిపించబోతున్నాడట. సినిమాకి సరిపోయే బడ్జెట్‌తో, భారీ ఎత్తున ఈ వెబ్ సిరీస్ డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది. కథ కూడా రెడీ అయిపోయిందట. రేపో, మాపో.. సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. మరి ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో అయినా మెహర్ రమేష్ కుదురుకుంటాడేమో చూడాలి.