మెహర్ రమేష్‌కి రాక రాక ఓ అవకాశం వచ్చింది. అది కూడా మెగాస్టార్ చిరంజీవితో. చిరు - మెహర్ రమేష్ కాంబినేషన్‌లో `భోళా శంకర్` రూపొందుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో విజయవంతమైన వేదాళంకి ఇది రీమేక్. తమన్నా కథానాయిక. కీర్తి సురేష్ చిరు చెల్లాయిగా నటిస్తోంది. ఈ సినిమాపై ఎవ్వరికీ నమ్మకాల్లేవు. దానికి కారణం.. మెహర్ రమేష్ మాత్రమే. ఎందుకంటే మెహర్ ట్రాక్ రికార్డ్ అలా ఉంది. శక్తి, షాడో సినిమాల తరవాత మెహర్‌కి అవకాశం రావడమే గొప్ప అనుకున్నారు. అయితే వచ్చినప్పుడైనా దాన్ని వినియోగపరచుకోవాలి కదా, కానీ మెహర్ మాత్రం నిర్మాతల్ని ఇప్పటికీ ఇబ్బంది పెడుతున్నాడని టాక్.
సెట్లో మెహర్ ప్రవర్తిస్తున్న తీరు పట్ల నిర్మాత అసహనంతో ఉన్నాడని సమాచారం. మెహర్ అనవసరమైన ఖర్చులు ఎక్కువ పెడుతున్నాడని, సెట్లో వృథా ఎక్కువ అవుతోందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంపై మెహర్‌ని నిర్మాత అనిల్ సుంకర ఎన్నిసార్లు నచ్చజెప్పినా మెహర్ వినిపించుకోవడం లేదట. దాంతో... ఇప్పుడు ఈ వ్యవహారం చిరు దగ్గరకు తీసుకెళ్లారు.
మెహర్ విషయం తేల్చమని, ఇలాగైతే సినిమా హిట్టయినా, లాభాలు రావని, ఖర్చుని అదుపులో ఉంచుకోకపోతే.. ఎంత కష్టపడినా ఉపయోగం ఉండదని చిరు దగ్గర మొర పెట్టుకొన్నార్ట, ఈ విషయంలో చిరు కూడా మెహర్‌కి క్లాస్ పీకినట్టు సమాచారం. ఖర్చు పెంచుకొంటూ పోతే.. రెమ్యునరేషన్‌లో కోత ఎదుర్కోవాల్సివస్తుందని చిరు హెచ్చరించాడట. చిరునే చెబితే మెహర్ వినకుండా ఎలా ఉండగలుగుతాడు? ఇక నుంచైనా మెహర్ ఖర్చులు తగ్గిస్తాడేమో చూడాలి.