మెహర్ రమేష్... ఈ పేరు వింటేనే కొంతమంది ఫ్యాన్స్ ఉలిక్కిపడి లేస్తుంటారు. మెహర్ రమేష్ టాలెంటు, ట్రాక్ రికార్డు అలాంటిది. తనపై ఎన్ని జోకులో. మెగాఫోన్ పట్టి చాలాకాలం అయ్యింది. అయినా మెహర్‌నీ మెహర్ రమేష్ ఇచ్చిన కళాఖండాల్నీ చిత్రసీమ మర్చిపోలేదు. గత కొంతకాలంగా మహేష్ బాబుతో బాగా టచ్‌లో ఉంటున్నాడు మెహర్. తన పర్సనల్ విషయాలన్నీ మెహర్ దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఇప్పుడు చిరంజీవికి దగ్గరయ్యాడు. ఎంతగా అంటే.. చిరుతో ఓ సినిమా తీయడానికి స్కోప్ వచ్చేంతలా. చిరంజీవితో ప్రముఖ న్యూస్ ఛానల్ ఓ ఇంటర్వ్యూ చేసింది.
ఆ ఇంటర్వ్యూలో భాగంగా చిరు తన కొత్త సినిమా విశేషాల్ని చెప్పుకొచ్చాడు. బాబి, సుజిత్‌లతో చెరో సినిమా చేస్తున్నానని, అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని చెప్పుకొచ్చాడు చిరు. మెహర్ రమేష్ తో కూడా పనిచేసే అవకాశం ఉందని బాంబు పేల్చాడు. నిజానికి ఈ కాంబో ఎవరూ ఊహించనిది. ఈమధ్య చిరంజీవి సీసీసీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన పనులన్నీ మెహర్ రమేష్ దగ్గరుండి చూసుకుంటున్నాడు. అలా చిరుతో సాంగత్యం బాగా పెరిగింది. చిరు కూడా ఓ అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయినట్టున్నాడు. చిరు మనసు మంచిదే. కాకపోతే పోయి పోయి మెహర్ రమేష్ తో సినిమా ఏంటా? అని ఫ్యాన్స్ ఇప్పుడు కంగారు పడుతున్నారు. చిరు ఎందుకింత రిస్క్ చేస్తున్నాడో మరి.