ఓ సీనియర్ జర్నలిస్ట్ ఒకరు న్యూస్ ఛానల్ చర్చా కార్యక్రమంలో నోరు జారేసిన వ్యవహారంపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు, ఆ జర్నలిస్ట్ తీరుపై మండిపడుతున్నారు. లేటెస్ట్‌గా ఈ లిస్ట్‌లోకి క్యూట్ బ్యూటీ మెహరీన్ కౌర్ పిర్జాదా కూడా చేరింది.
సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటోన్న కొందరు, విలువల్ని దిగజార్చేలా వ్యవహరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 'మహిళను గౌరవించలేనివారు జంతువులకంటే హీనం' అంటూ సోషల్ మీడియా ద్వారా స్పందించింది మెహరీన్. సినిమాల్లో హీరోయిన్లు కావొచ్చు, ఇతరత్రా మహిళా నటీమణులు కావొచ్చు ఆయా పాత్రలకు అనుగుణంగా నటిస్తారనీ, కేవలం ప్రేక్షకుల్ని అలరించేందుకోసం చేసే ఆ 'నటన'ని గౌరవప్రదమైన వృత్తిగా తామంతా భావిస్తామనీ, సామాజిక బాధ్యతతోనూ సినీ పరిశ్రమ నుంచి ఎన్నో అద్భుతమైన చిత్రాలు వస్తాయనీ, అలాంటి సినీ పరిశ్రమను గౌరవించలేని కుసంస్కారులే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని మెహరీన్ అభిప్రాయపడింది.
వరుసగా మూడు ట్వీట్లు వేసిన మెహరీన్, సినీ పరిశ్రమ గొప్పతనాన్నీ, హీరోయిన్ల గురించీ పేర్కొన్న విషయాలిప్పుడు వైరల్‌గా మారుతున్నాయి. 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మెహరీన్, అతి తక్కువ కాలంలోనే హీరోయిన్‌గా మంచి స్టార్‌డమ్ సంపాదించుకున్న విషయం విదితమే. ఇదిలా వుంటే, సినీ పరిశ్రమపై వివాదాస్పద, జుగుప్సాకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్‌పై ఇప్పటికే పోలీసులకు పిర్యాదు చేసింది 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్'.