గత రెండు మూడు రోజుల నుండి అమెరికాలో తెలుగు జంట నడుపుతున్న వ్యభిచార వ్యాపారం బయటపడ్డ వార్త సంచలనం రేపుతున్నది. దీనికి సంబంధించి పూటకొక వార్త వాస్తునే ఉన్నాయి.
అయితే ఈ వ్యభిచార గుట్టు బయటపడడంతో అమెరికాలో షూటింగ్ చేయడానికి వెళ్ళే వారి పైన అక్కడి పోలీసు అధికారులు నిఘా పెడుతున్నారు. తాజాగా నటి మెహ్రీన్ కి ఇటువంటి చేదు అనుభవమే ఎదురైందట. ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్ కోసం అమెరికా వెళ్ళిన తనకి ఒక మూడు రోజులు విశ్రాంతి దొరకడంతో అమెరికాలోనే తన తల్లిదండ్రులని కలిసేందుకు వెళ్ళింది.
ఈ ప్రయాణం సందర్భంలోనే అమెరికాలోని ఒక ఎయిర్ పోర్ట్ లో ఆమె తెలుగు హీరోయిన్ అని తెలుసుకుని స్థానికంగా ఉన్న పోలీసులు విచారణ చేపట్టడం జరిగిందట. అయితే ఆ పోలీసులు అడిగిన ప్రశ్నలు విన్నాక గాని ఇలాంటి ఒక సంఘటన అమెరికాలో జరిగింది అని తనకి తెలియదని చెప్పుకొచ్చింది.
ఇక మెహ్రీన్ ని విచారించినట్టుగానే మరికొంతమందిని ఈ కేసు విషయమై విచారించినట్టుగా తెలుస్తున్నది. ఏదేమైనా ఈ ఎఫెక్ట్ తో అమెరికాలో షూటింగ్ కోసం వెళ్ళే తెలుగు సినిమా వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు లేకపోలేదు.