'హనీ ఈజ్ ద బెస్ట్..' అంటూ ఈ ఏడాది 'ఎఫ్ 2'తో బ్లాక్ బస్టర్ కొట్టేసింది ముద్దుగుమ్మ మెహ్రీన్‌కౌర్. తర్వాత నుండి ఏదో ఒక సినిమా అన్నట్లుగా కాకుండా, కాస్త ఆచి తూచి అడుగులు వేస్తోంది. కొంచెం ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్స్‌ని ఎంచుకుంటోందట. కథల ఎంపికలో చాలానే జాగ్రత్తలు తీసుకుంటోందట. డైరెక్టర్‌కీ మెహ్రీన్ ప్రాధాన్యత ఇస్తోందని అనుకుంటున్నారు. అందుకే ఆ తర్వాత మెహ్రీన్ చేతిలో ఒకటీ అరా సినిమాలు మాత్రమే పడ్డాయి. నాగశౌర్యతో ఓ సినిమాలో నటిస్తోంది. ఇటీవల ఆ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. తాజాగా మెహ్రీన్ ఖాతాలో మరో ప్రాజెక్ట్ వచ్చి చేరినట్లు తెలుస్తోంది. నందమూరి హీరో కళ్యాణ్‌రామ్ సినిమాలో మెహ్రీన్ ఛాన్స్ దక్కించుకుందట. ఈ సినిమాలో మొదట కొత్త భామని తీసుకోవాలనుకున్నారట. అయితే, పాత్ర పరంగా మెహ్రీన్ అయితే బావుంటుందని భావిస్తున్నారట.
'శతమానం భవతి'తో సూపర్ హిట్ అందుకున్న సతీష్ వేగేశ్న ఈ సినిమాకి దర్శకుడు. సతీష్ వేగేశ్న సినిమా అంటే అంచనాలు బాగానే ఉంటాయి. అందులోనూ స్క్రిప్టులో తన పాత్ర చిత్రీకరణ కూడా బాగుండడంతో మెహ్రీన్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనీ తెలుస్తోంది. అన్నింటికీ మించి నందమూరి హీరోతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం. సో ఇవన్నీ కలిసి మెహ్రీన్ ఖాతాలో కొత్త ప్రాజెక్టుకు చోటు దక్కించాయి. మరోవైపు 'ఎఫ్ 2' బాలీవుడ్‌లో రీమేక్ చేసే అవకాశాలున్నాయి. ఆ రీమేక్‌లో హనీ పాత్ర మెహ్రీన్‌కే ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో బాలీవుడ్ వర్గాలున్నట్లు ఓ టాక్. చూడాలి మరి, హనీ ఈజ్ ద బెస్ట్ అని మరోసారి మన హనీ అనిపించుకుంటుందేమో చూడాలి.