నటీనటులు : కీర్తి సురేష్, జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, నరేష్, నవీన్ చంద్ర తదితరులు
దర్శకత్వం : నరేంద్రనాథ్
నిర్మాతలు : మహేష్ కోనేరు
సంగీతం : థమన్
సినిమాటోగ్రఫర్ : దాని స్యాంకేజ్-లోపెజ్, సుజిత్ వాసుదేవ్
ఎడిటర్: తమ్మిరాజు
రేటింగ్: 2.25/5
అమ్మాయిలు ఎందులో తక్కువ..?
అబ్బాయిలతో పాటు సమానంగా కష్టపడతారు. ఆ మాటకొస్తే.. ఇంకా ఎక్కువే కష్టపడతారు. ఓ ఇల్లు ఇస్తే.. దాన్ని కుటుంబంగా మారుస్తారు. కాస్త నమ్మకం ఇస్తే - సంతోషాలు పూయిస్తారు. ఓర్పు, సహనం.. వీటన్నింటిలోనూ వాళ్లు ఎక్కువే. వ్యాపారంలో మాత్రం ఎందుకు తక్కువ? ఇలాంటి ఆలోచన ఉన్న ఓ అమ్మాయి కథ... `మిస్ ఇండియా`. తన చిననాటి స్వప్నాన్ని ఓ అమ్మాయి ఎలా నిజం చేసుకుంది? అనే పాయింట్ పై తీసిన సినిమా `మిస్ ఇండియా`. మహానటి కీర్తి సురేష్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై ఫోకస్ పెరగింది.
థియేటర్లు లేని ఈ రోజుల్లో ఓటీటీ ద్వారా విడుదల అయిన మరో సినిమా ఇది. మరి.. ఈ సినిమా ఎలా వుంది? `మిస్ ఇండియా`గా కీర్తి ఏం చెప్పింది? ఓటీటీలో వచ్చిన సినిమాలన్నీ పరాజయంపాలవుతున్న ఈ దశలో.. `మిస్ ఇండియా` ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతోంది? ఈ విషయాలు తెలుసుకోవాలంటే.. సమీక్షలోకి వెళ్లాల్సిందే.
* కథ
మానస సంయుక్త (కీర్తి సురేష్) చిన్నప్పటి నుంచీ... బిజినెస్ వుమెన్ కావాలని కలలు కంటుంటుంది. కానీ ఇంట్లో మాత్రం `అమ్మాయికి బిజినెస్ ఎందుకు` అని సర్ది చెబుతూ ఉంటారు. తాతయ్య మరణం, ఇంటి సమస్యలతో మానస కుటుంబం అమెరికా షిఫ్ట్ అవుతుంది. కానీ తాతయ్య దూరమైన బాధ, సొంత ఊరిని వదిలి రావడం.. మానసకు ఇబ్బంది కలిగిస్తాయి. ఇలాంటి దశలో మానసకు విజయ్ ఆనంద్ (నవీన్ చంద్ర) పరిచయం అవుతాడు. మానసలో స్ఫూర్తి నింపుతాడు. తన కంపెనీలోనే ఉద్యోగం సంపాదిస్తుంది మానస. కానీ.... చేయాలనుకున్నది ఉద్యోగం కాదు. వ్యాపారం. అందుకే ఆ ఉద్యోగంలో ఉండలేకపోతుంది.
తనని తాను నిరూపించుకోవడానికి.... వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటుంది. తనకు చిన్నప్పటి నుంచీ టీ అంటే ఇష్టం. అమెరికాలో కాఫీ తప్ప టీ దొరకదు. అందుకే అమెరికాలో టీ - అమ్మాలని ఫిక్సయిపోతుంది. అమెరికాలో కాఫీ బిజినెస్‌లో నెంబర్ వన్ అయిన కైలాష్ (జగపతిబాబు) దగ్గర అవమానం పాలై... తనతోనే ఛాలెంజ్ చేస్తుంది. మరి ఆ ఛాలెంజ్‌లో మానస గెలిచిందా? ఈ ప్రయాణంలో.. తనకు ఎదురైన అనుభవాలేంటి? అన్నదే మిస్ ఇండియా కథ.
* విశ్లేషణ
మిస్ ఇండియా అంటే ఇదేదో అందాల పోటీలకు సంబంధించిన కథ అనుకుంటారు. కానీ... ఇది అలాంటి కథ కాదు. వ్యాపారంలో ఓనమాలు తెలియని అమ్మాయి - అదే వ్యాపారంలో దిగ్గజాన్ని ఢీ కొడుతుంది. అమ్మాయిలు ఎందులోనైనా గెలవగలరు. అని నిరూపించాలనుకుంటుంది. ఆ ప్రయాణంలో ఆమెకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అనేదే `మిస్ ఇండియా`.
అయితే దర్శకుడు ఈ పాయింట్ లోకి వెళ్లడానికి చాలా సమయం తీసుకున్నాడు. ఈ కథని రెండు భాగాలుగా విభజించొచ్చు. మొదటి భాగం... కథానాయిక కుటుంబ సమస్యలు, ఆ తరవాత అమెరికా రావడం, ఇక్కడ ఉద్యోగం చేయడం... ఇలా సాగుతుంది. వ్యాపారంలో ఎదురైన అవరోధాలు ద్వితీయార్థంలో చూపించారు. నిజానికి ఈకథకు ద్వితీయార్థమే బలం. అసలు కథలోకి చాలా ఆలస్యంగా వెళ్లి దర్శకుడు చాలా పొరపాటు చేశాడనిపిస్తుంది. తొలి సగంలో.. ఆసక్తికరమైన సన్నివేశాలేం ఉండవు. చాలా నిదానంగా సాగుతూ ఉంటుంది. కథానాయిక కష్టాలు తప్ప ఇంకేం కనిపించవు. కథకి చాలా కీలమైన బిజినెస్ పాయింట్ ని ద్వితీయార్థం వరకూ వాయిదా వేశాడు దర్శకుడు.
కైలాష్‌తో జరిగే మొదటి మీటింగ్ చూస్తే.. మానస కైలాస్ మధ్య భీకరమైన పోరాటం సాగుతుంది, ఇద్దరూ ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటారు అనిపిస్తుంది. కానీ.. ఆ తరవాత కూడా కథ చాలా సాధారణంగా సాగుతుంది. ఇలాంటి కథల్లో సాధారణంగా హీరోని కూల్చడానికి, అతని వ్యాపారాన్ని అడ్డుకోవడానికి విలన్లు ఏం చేస్తారో.. ఇక్కడా జగపతిబాబుతో అదే చేయించారు. ద్వితీయార్థంలో చాలా సన్నివేశాలు లాజిక్ కి దూరంగా ఉంటాయి. ప్రపంచంలోనే అగ్ర వ్యాపార వేత్తల్లో ఒకడిగా చలామణీ అవుతున్న కైలాష్‌ని.. కేవలం రెండు నెలల్లో ఓ అమ్మాయి.. అదీ ఓ టీ షాపుతో గడగడలాడించేయడం - చాలా సిల్లీగా అనిపిస్తుంది. చివర్లో ఆస్తులన్నీపోయినట్టు.. బికారి అయిపోయినట్టు చూపించడం మరీ విడ్డూరం. నవీన్ చంద్ర పాత్రని కూడా దర్శకుడు సరిగా వాడుకోలేదు. ఆ ట్రాక్ కేవలం నిడివి పొడిగించుకోవడానికే ఉపయోగపడ్డాయి. కథనంలో వేగం, ఆసక్తి ఇవన్నీ లోపించాయి. మలుపులూ ఉండవు. తొలి భాగంతో పోలిస్తే.. ద్వితీయార్థమే కాస్త నయం అనుకోవాలి.
* నటీనటులు
కీర్తి సురేష్ ఇప్పుడు వరుసగా నాయికా ప్రాధాన్యం ఉన్న కథల్ని ఎంచుకొంటోంది. అయితే ఆ కథలో నవ్యత ఉండేలా చూసుకోవడం కీర్తి బాధ్యత. జాతీయ ఉత్తమ నటి అనిపించుకున్న కథానాయిక,.. ఆ స్థాయిలోనే సినిమాలు చేస్తుందని అంతా ఆశిస్తారు. నటన పరంగా.. ఎక్కడా లోటు చేయలేదు.కాకపోతే... వైవిధ్యం ఉన్న కథల్ని ఎంచుకున్నప్పుడే ఛాలెంజింగ్ అనిపిస్తుంది. నవీన్ చంద్ర కొద్దిసేపు కనిపించాడు. నదియా, రాజేంద్ర ప్రసాద్, నరేష్.. వీళ్లంతా ఆయా పాత్రలకు హుందాతనం తీసుకొచ్చారు. జగ్గూభాయ్ గురించి కొత్త గా చెప్పేదేముంది? స్టైలీష్ విలన్ పాత్రల పేటెంట్ హక్కులు ఆయన దగ్గరే ఉన్నాయి. మరోసారి ఆయన నటన ఆకట్టుకుంటుంది.
* సాంకేతిక వర్గం
పాటలకు పెద్దగా ఆస్కారం లేని కథ ఇది. రెండే రెండు పాటలు వినిపిస్తాయి. అయితే వాటిలోనూ.. కొత్తదనం ఉండదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఫొటోగ్రఫీ నచ్చుతుంది. ఆడవాళ్ల గురించి రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు చాలా సాదా సీదా కథని ఎంచుకున్నాడు. కథనంలోనూ తన క్రియేటివిటీ చూపించలేకపోయాడు. జాతీయ ఉత్తమ నటినీ, మిస్ ఇండియా అన్న మంచి టైటిల్ నీ సరిగా వాడుకోలేదు.
* ప్లస్ పాయింట్స్
కీర్తి సురేష్
జగపతిబాబు
* మైనస్ పాయింట్స్
కథ, కథనం
ఎమోషన్ లేకపోవడం
* ఫైనల్ వర్డిక్ట్: మంచి ఛాన్స్ `మిస్` అయ్యింది