సర్కార్ సినిమాకీ, మిక్సీ - గ్రైండర్‌కీ ఉన్న సంబంధం ఏమిటో, ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు, ఈ సినిమాపై తలెత్తిన వివాదాల్ని ఫాలో అవుతున్నవాళ్లకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్నాడీఎంకే పార్టీ గతంలో ఇచ్చిన ఫ్రీ మిక్సీ, గ్రైండర్లపై ఈ సినిమాలో ఓచురక అంటించాడు మురుగదాస్.
వాటిని మంటల్లో పడేసి - అన్నాడిఎంకే కార్యకర్తల కడుపు మండిపోయేలా చేశాడు. ఆ సన్నివేశాల్ని తొలగించాలని అన్నాడిఎంకే పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. చివరికి ఆ సన్నివేశాల్ని తొలగించారు కూడా. అయితే.. మురుగ మాత్రం ఈ మిక్సీలను, గ్రైండర్లను వదల్లేదు.
సర్కార్ సినిమా ఘన విజయం సాధించిన సందర్భంగా చిత్రబృందం ఓ కేక్ కట్ చేసింది. ఆ కేకులో మిక్సీ, గ్రైండర్ ప్రతిమలు కనిపించాయి. ఇది కేవలం అన్నాడిఎంకే కార్యకర్తల్ని ఉడికించడానికి మురుగదాస్ చేసిన పని అని తెలుస్తూనే ఉంది. ఈ కేకు చూసి తమిళ నాట అన్నాడిఎంకే పార్టీ అనుచరుల మనసులు నొచ్చుకున్నాయి. `నీ అహంకారానికి ఇది నిదర్శనం` అంటూ మురుగదాస్‌పై కౌంటర్లు మొదలెట్టారు.
అయితే ఈ వివాదాలు, విమర్శలు మురుగ పట్టించుకోవడం లేదు. ఎందుకంటే తన లక్ష్యం నెరవేరిపోయింది. `సర్కార్` హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. 150 కోట్లు దాటి.. 200 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. అంతకంటే ఇంకేం కావాలి..?