ప్రధాని నరేంద్రమోడీని మోహన్‌బాబు కుటుంబం కలుసుకోవడం చర్చనీయాంశమైంది. కేవలం ఓ సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తిగా ప్రధానిని కలుసుకున్నా - మా మధ్య రాజకీయాల చర్చకు రాలేదు అని మంచు లక్ష్మీ చెప్పేసింది. విష్ణు కూడా అదే మాట అన్నాడు. అయితే జనాలు మాత్రం మోహన్ బాబు పార్టీ మారడం ఖాయం అంటున్నారు. ఆయన ప్రస్తుతం వైకాపాలో ఉన్నారు. సరిగ్గా ఏపీలో ఎన్నికలు జరగడానికి ముందు ఆయన వైకాపా కండువా వేసుకున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరవాత.. మోహన్ బాబుకి ఏదో ఓ పదవి ఇస్తారనుకున్నారు. కానీ అదేం జరగలేదు. నామినేటెడ్ పోస్టులన్నీ అయిపోయాయి.
ఇప్పుడు కొత్తగా వచ్చే పోస్టులేం లేవు. అందుకే మోహన్ బాబు బీజేపీవైపు మొగ్గు చూపిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అందుకోసమే ఆయన ఢిల్లీ పనిగట్టుకుని వెళ్లారని, ప్రధానితో చర్చలు జరిపారని తెలుస్తోంది. అయితే అవన్నీ కప్పిపుచ్చుతూ.. మా మధ్య రాజకీయాల ప్రస్తావన రాలేదు, నేను వైకాపాలోనే ఉంటా అంటూ మోహన్‌బాబు చెబుతున్నారు. ఆమాత్రం దానికి ఢిల్లీ వరకూ వెళ్లడం ఎందుకు? ప‌్రధానితో అరగంట సమావేశం అవ్వడం ఎందుకు? కేవలం సినిమాలకు చెందిన వ్యక్తిగా వెళితే, కొడల్ని సైతం ఎందుకు వెంటబెట్టుకుని వెళ్లినట్టు? అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా.. ఈ ములాఖాత్ మాత్రం హాట్ టాపిక్ అయ్యింది. దీని ఫలితం ఏమిటో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.