మోహన్‌బాబు ఆయన తనయుడు మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా విద్యార్థులకు మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ, ఎందుకో 'మంచు' మాటలు చాలామందికి నచ్చడంలేదు. బహుశా ఈ ఇద్దరూ ఓ రాజకీయ పార్టీకి ప్రాతినిథ్యం వహిస్తుండడం వల్లే కావొచ్చు. తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాల గందరగోళం నేపథ్యంలో 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కొంత ఆలస్యంగానే అయినా మంచు కుటుంబం స్పందించింది.
విద్యా సంస్థలను నిర్వహిస్తున్న మంచు కుటుంబం, కొన్నాళ్ళ క్రితం ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు రాలేదంటూ చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేసి, ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే. అప్పుడు విద్యార్థుల మీద ప్రేమ ఒలకబోసిన మంచు కుటుంబం, ఇప్పుడెందుకు కేసీఆర్ పాలనపైన విమర్శలు చేయడంలేదని ప్రశ్నిస్తున్నారు కొందరు నెటిజన్లు. 'ప్రభుత్వం స్పందించింది' అని మంచు మోహన్‌బాబు, విష్ణు తమ ట్విట్టర్ పేజ్‌లలో ప్రస్తావించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
తెలంగాణా రాష్ట్రంలో కొందరు విద్యార్థినీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవటం మనసు కలిచివేసింది... pic.twitter.com/ZUCZ8vv3XN
— Mohan Babu M (@themohanbabu) April 26, 2019
ఆంధ్రప్రదేశ్‌లో తప్పిదాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలా? తెలంగాణలో తప్పిదాలకు బాధ్యత అధికారులదా? అని నెటిజన్లు ప్రశ్నలతో హోరెత్తిస్తున్నారు. అయితే ఈ సమయంలో విద్యార్థులకు బాసటగా ఓ మంచి మెసేజ్ ఇచ్చేందుకు ప్రయత్నించిన మంచు కుటుంబాన్ని అభినందించాలి తప్ప, ఇది విమర్శల సమయం కాదనే అభిప్రాయాలు కూడా కొందరి నుంచి వ్యక్తమవుతున్నాయి.