సినిమా థియేటర్లు తెలంగాణలో తెరచుకున్నాయి. కానీ, ఆ జోష్ ఏదీ ఎక్కడ.? పెద్ద సినిమాలు ఏవన్నా థియేటర్లలోకి వస్తే తప్ప, ఆ సందడిని ఇప్పటికిప్పుడు ఊహించలేం. ఒకవేళ పెద్ద సినిమాలొచ్చినా, పరిస్థితి ఎలా వుంటుందో తెలియదు. 'టెనెట్' సినిమా థియేటర్లలో విడుదలవడంతో కొంతమంది, చాలాకాలం తర్వాత థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోసం వెళ్ళారు.
కానీ, వారికి ఆ ఎక్స్‌పీరియన్స్ కొత్తగా అనిపించలేదు.. 'అవసరం' అని కూడా అందులో చాలామంది అనుకోవడంలేదట. ఇలాగైతే, పెద్ద సినిమాల్ని థియేటర్లలో విడుదల చేసేదెలా.? అన్న ఆందోళన సినీ వర్గాల్లో పెరిగిపోయింది. ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్‌గా నటించింది. ఓ మోస్తరు అంచనాలున్న సినిమానే ఇది.
అయితే, డిసెంబర్ 25 నాటికి పరిస్థితులు ఎలా వుంటాయో ఇప్పుడే చెప్పలేం. థియేటర్లకైతే జనం పెద్దగా వెళ్లడంలేదు. సినిమాని థియేటర్లలో చూడాలన్న ఇంట్రెస్ట్ ప్రేక్షకుల్లో కనిపించడంలేదంటూ సోషల్ మీడియాలో నిర్వహిస్తోన్న కొన్ని పోలింగ్స్ ద్వారా అర్థమవుతోంది. ఇలాగైతే, సంక్రాంతి పరిస్థితేంటి.? ఏమోగానీ, థియేటర్లను కొనసాగించాలా.? వద్దా.? అన్న విషయమై థియేటర్ల యాజామాన్యలు కూడా ఆందోళన చెందాల్సి వస్తోంది. చాలాకాలంగా థియేటర్లు మూతపడిపోయిన దరిమిలా, నిర్వహణ ఖర్చులు మరింత భారమైపోయాయి. ఈ సినిమా కష్టాలు ఎప్పుడు తీరతాయో ఏమో.!