కరోనా - లాక్ డౌన్ వల్ల... భారీగా నష్టపోయిన పరిశ్రమలో చిత్రసీమ ఒకటి. నష్టాలు నికరంగా ఇంత అని చెప్పలేం గానీ, దేశం మొత్తం మీద చూసుకుంటే వందల కోట్లకుపైనే ఉండబోతోంది. థియేటర్లు తెరవడం ఎంత ఆలస్యం అయితే, ఆ నష్టం అంత ఎక్కువగా ఉండబోతోంది. సినిమా పూర్తయి, విడుదలయ్యేంత వరకూ నిర్మాతలకు దిన దిన గండమే. వడ్డీ.. కొండలా పెరిగిపోతుంది. వాటిని తట్టుకోవడం మామూలు విషయం కాదు. పైగా విడుదల ఆలస్యమయ్యే కొద్దీ ప్రాజెక్టు స్టేల్ అయిపోతుంది. `పాత సినిమా` అనే ముద్ర పడితే - ఇక ఆ సినిమాని దేవుడు కూడా కాపాడలేడు.
ఇప్పుడు టాలీవుడ్ లో చాలా సినిమాలు ఈ సమస్యనే ఎదుర్కొంటున్నాయి. త్వరలో లాక్ డౌన్ ఎత్తేస్తారని, ఎత్తకపోయినా, కొన్ని మినహాయింపులు లభిస్తాయని చిత్రసీమ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చని ఆశ పడుతోంది. థియేటర్లు ఓపెన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే థియేటర్లు ఓపెన్ అయినా నిర్మాతలకు ఒరిగేది ఏం ఉండదు. ఎందుకంటే.. కరోనా సమస్య ఇప్పట్లో పోయిది కాదు. ఆ భయం ప్రేక్షకుల్ని వెంటాడుతూనే ఉంటుంది. థియేటర్లు తెరచినంత మాత్రాన ప్రేక్షకులు ఎగబడి వచ్చేసే అవకాశం లేదు. పైగా థియేటర్లు తెరచుకున్నా రూల్స్ మారబోతున్నాయి. సిట్టింగ్ సిస్టమ్ కొత్తగా కనిపించబోతోంది. సీటు సీటుకీ మధ్య గ్యాప్ ఇవ్వాలి. అంటే.. 50 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ ఉంటుందన్నమాట. అంతేకాదు.. రెడ్ జోన్స్ లో థియేటర్లు ఏమాత్రం తెరచుకునే అవకాశం లేదు. అక్కడ కలక్షన్లను నిర్మాతలు పూర్తిగా నష్టపోయినట్టే. ఓవర్సీస్‌లో థియేటర్లు కూడా పూర్తిగా బంద్ అవ్వొచ్చు.
ఓవర్సీస్ లో సినిమాలు విడుదల అవ్వకపోతే... నిర్మాతలు తమ రాబడిని భారీగా కోల్పోతారు. థియేటర్లని నిర్వహించడం పెద్ద సమస్యగా మారుతుంది. ఎందుకంటే.. ప్రతీ షోకీ మధ్యలో శానిటైజేషన్ చేయాలి. శుభ్రత విషయంలో ఇది వరకటికంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకోసం అదనపు సిబ్బంది అవసరం. ఇవన్నీ భరించడం థియేటర్ల వల్ల కాదు. అందుకే లాక్ డౌన్ ఎత్తేసినా, థియేటర్లు తెరచుకున్నా - సగం కలక్షన్ల కోసం సినిమాల్ని విడుదల చేయలేరు. అలాగని.. సినిమాల్ని విడుదల చేయకుండా వదల్లేరు. మరి ఈ కష్టాలన్నీ ఎప్పుడు తొలగిపోతాయో..?