కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు ఇంటి వద్దనే వుండడం చాలా అవసరం. సినిమా థియేటర్లు మూతబడ్డాయ్.. షాపింగ్ మాల్స్ అందుబాటులో లేవు.. ఆ మాటకొస్తే.. దేవాలయాలకు వెళ్ళేందుకూ అవకాశాల్లేని పరిస్థితి. ఇదిలా వుంటే, తమ అభిమానుల్ని ఉద్దేశించి ఆయా స్టార్ హీరోలు, కరోనా వైరస్ పట్ల అప్రమత్తం చేస్తూ వస్తున్నారు వివిధ మార్గాల్లో. హీరో రామ్ పోతినేని, తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానుల నుంచి ఓ బహుమతిని ఆశిస్తున్నట్లు చెప్పడా. అదేంటంటే, సెలబ్రేషన్స్ లాంటివేమీ తన పుట్టిన రోజు నాడు చేయకుండా, ఇంటి పట్టునే అభిమానులు వుండాలట.
నిజంగానే ఇది పెద్ద బహుమతిగానే భావించాల్సి వుంటుంది. సాధారణంగా హీరోల పుట్టిన రోజు వేడుకలంటే, అభిమానుల హంగామా ఓ స్థాయిలో వుంటుంది. కానీ, ఇప్పుడు సందర్భంగా సెలబ్రేషన్స్ చేసుకునేలా లేదు. అందుకే, తమ అభిమాన హీరో చెప్పినట్లు అభిమానులు నడుచుకోవాల్సిందే.
ఈ ఏడాది కుదరలేదు.. వచ్చే ఏడాది అవకాశం వుంటుంది కదా. మొన్నటికి మొన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇదే తరహాలో అభిమానుల నుంచి బహుమతిని ఆశించాడు. అంతేనా, చాలామంది హీరోలు తమ అభిమాన హీరోలకు ఇలాంటి బహుమతులే అడుగుతున్నారు. మంచి బహుమతే కదా.. సెలబ్రిటీలకు అభిమానులు ఇచ్చేయకుండా వుంటారా.? తమ అభిమానుల పట్ల ఆయా హీరోలు చూపిస్తున్న శ్రద్ధకి హేట్సాఫ్ అంతే. రామ్ ప్రస్తుతం ‘రెడ్’ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్న విషయం విదితమే.