లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారో ఇంకా స్పష్టత లేదు గానీ, త్వరలోనే సినిమాలకు అనుమతి ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ముందు షూటింగులు మొదలెట్టొచ్చు. ఆ తరవాత.. థియేటర్లు ఓపెన్ అవుతాయి. జూన్ తొలి వారంలో థియేటర్లు తెరుచుకునే అవకాశాలున్నాయి. అప్పుడే.. షూటింగులూ మొదలవ్వొచ్చు. అయితే... షూటింగుల నిర్వహణ అంత తేలిక కాదు.
కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం.. కొన్ని కఠినమైన నిబంధనల్ని పాటించాల్సివుంది. మరీ ముఖ్యంగా చిత్రబృందంలో కరోనా వల్ల ఎవరైనా చనిపోయారని నిర్దారణ అయితే.. సదరు మృతుడి కుటుంబానికి నిర్మాత రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాల్సివుంటుంది. ఎంతమంది మృతి చెందితే అన్ని యాభై లక్షలు ఇవ్వాలన్నది ఓ నిబంధన. టీవీ సీరియళ్లకూ ఇవే నియమాల్ని అమలు చేయబోతున్నార్ట. సెట్లో అనుమతికి మించి జన సంచారం ఉంటే.. సదరు నిర్మాతపై కేసు నమోదు చేస్తారు. లాక్ డౌన్ నిబంధనల్లో ఏ ఒక్కటి పాటించకపోయినా నిర్మాతలు భారీ మొత్తంలో జరిమానా చెల్లించాల్సివుంటుంది. ఇవన్నీ చూస్తుంటే... లాక్ డౌన్ ఎత్తేసినా సరే, నిర్మాతలు షూటింగులకు ఏమాత్రం తొందరపడే ఆస్కారం లేదు.