కథానాయికలు ఈమధ్య తెలివి మీరిపోయారు. ఓ సినిమా హిట్టవ్వగానే... ఏమాత్రం ఆలోచించకుండా పారితోషికాలు పెంచేస్తున్నారు. డిమాండ్ ఉన్నప్పుడే... క్యాష్ చేసుకోవాలన్న ఆలోచన వాళ్లది. ఇది వరకు.. ఓ కథానాయిక కోటి రూపాయల స్థాయికి ఎదగాలంటే చాలా కష్టపడాల్సివచ్చేది. నాలుగైదు హిట్లు పడేంత వరకూ వాళ్లు కోటి అందుకోలేకపోయేవారు. ఇప్పుడు అలా కాదు. ఒక్క సినిమాకే.. `కోటి` పలికేస్తున్నారు. శ్రీలీల, కృతి శెట్టి... వీళ్లంతా.. అలా ఒక్క సినిమాకే కోటి అందుకొన్నారు. ఇప్పుడు వీళ్ల కంటే.. మృణాల్ ఠాకూర్ రెండు ఆకులు ఎక్కువే చదివింది. ఒక్క హిట్టు కొట్టి... ఏకంగా రూ.2 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తోందని టాక్.
'సీతారామం'తో ఆకట్టుకొన్న కథానాయిక.. మృణాల్ ఠాకూర్. తనకదే తొలి తెలుగు సినిమా. ఇప్పుడు నాని హీరోగా రూపొందుతున్న ఓ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకిగానూ.. 2 కోట్ల పారితోషికం డిమాండ్ చేసిందని సమాచారం. ఇది ఆమెకు కేవలం రెండో సినిమా మాత్రమే. అయినా సరే, మృణాల్ అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధమైనట్టు తెలుస్తోంది. మృణాల్ కి రెండు కోట్లు ఇవ్వడం టాలీవుడ్ లో ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. మృణాల్ లాంటి వాళ్లే రెండేసి కోట్లు తీసుకొంటే.. ఇక సమంత, అనుష్క లాంటి వాళ్లు ఎంత డిమాండ్ చేయాలో.?