పాపం... నిఖిల్ 'సినిమా' కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. `ముద్ర` అనే టైటిల్ పెట్టుకుంటే.. అది కాస్త వివాదాస్పదం అయ్యింది. చివరికి `అర్జున్ సురవరం`గా మార్చుకోవాల్సివచ్చింది. ఎప్పుడో డిసెంబరులో విడుదల కావాల్సిన సినిమా ఇది. ఇప్పటి వరకూ మోక్షం లభించలేదు.
మార్చి 29న పక్కాగా విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ ఈ సినిమా మళ్లీ వాయిదా పడింది. ఏకంగా మే 1కి వెళ్లిపోయింది. కేవలం బయ్యర్ల కోరిక మేరకే ఈ సినిమా విడుదలని వాయిదా వేస్తున్నాం అని చిత్రబృందం చెబుతున్నా బిజినెస్ జరక్కపోవడం వల్లే.. ఈ సినిమా బయటకు రావడం లేదన్నది ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. అయితే.. తన సినిమా వాయిదా పడినా హిట్టు కొట్టడం గ్యారెంటీ అని ధీమాగా చెబుతున్నాడు నిఖిల్. దానికీ కారణం ఉంది. గతంలో తన సినిమాలు కొన్ని ఇలానే విడుదల తేదీ ఇబ్బంది పెట్టింది. ఎక్కడికి పోతావు చిన్నవాడా, కార్తికేయ చిత్రాలు పలుసార్లు వాయిదా పడ్డాయి. ఆ రెండు సినిమాలూ హిట్టయ్యాయి.
ఇప్పుడు ఈసారీ అదే జరుగుతుందని చెబుతున్నాడు నిఖిల్. ''గతంలో నా సినిమాలు కొన్ని వాయిదా పడి విడుదలయ్యాయి. అయినా సరే, బాగా ఆడాయి. ఈసారీ అదే జరుగుతుంది'' అని ధీమా ప్రదర్శిస్తున్నాడు.