హీరోకి ఓ లోపం ఉండి.. సినిమా అంతా అదే లోపంతో కనిపించడం, హిట్టు కొట్టడం.. అదే ట్రెండ్. ఈ ఫార్ములాతో మారుతి రెండు హిట్లు కొట్టేశాడు కూడా. ఓ సినిమాలో ముగ్గురు హీరోలుండి, ఒకొక్కరికీ ఒక్కో లోపం ఉంటే.. అదే ఇప్పటి `ముగ్గురు మొనగాళ్లు`. శ్రీనివాసరెడ్డి ప్రధాన పాత్రధారి. అభిలాష్ రెడ్డి దర్శకుడు. ముగ్గురు ఆవారా గాళ్ల కథ ఇది. ఒకరికి వినపడదు, ఇంకొకరికి కనపడదు.. మరొకరు మాట్లాడలేడు. మరోవైపు హైదరాబాద్ లో వరుస హత్యలు జరుగుతుంటాయి.
ఈ హత్య కేసుని ఛేదించడం పోలీసులకు పెను సవాల్ గా మారుతుంది. అయితే ఈ కేసులో క్లూస్... సాధించి, సాల్వ్ చేయడంలో ఈ ముగ్గురు మొనగాళ్లూ సాయం చేస్తారు. అదెలా అన్నదే కథ. ఈ సినిమా ట్రైలర్ ఈ రోజే విడుదలైంది. శ్రీనివాస రెడ్డి తనదైన కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించాడు. ఈ నవ్వులకు మర్డర్ మిస్టరీ బ్రేకులు వేసి, కథని సీరియస్ మలుపు తిప్పింది. ఇటీవల కన్నుమూసిన టీఎన్నార్... ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో కనిపించారు. రాజా రవీంద్రకు మరో ఫుల్ లెంగ్త్ పాత్ర దక్కింది. మొత్తానికి ముగ్గురు మొనగాళ్లు మంచి ఫన్ రైడర్ గా ఉంటుందన్న భరోసా కల్పించింది. చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తారు.