వెబ్ సిరీస్‌లలో ఓ సంచలనం... ది ఫ్యామిలీమెన్. రాజ్ డీకే రూపొందించిన ఈ వెబ్ సిరీస్... అంతర్జాతీయ ప్రమాణాలతో సాగింది. తొలి సీజన్ సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు రెండో సీజన్ రాబోతోంది. సమంత ఓ కీలక పాత్ర పోషించడంతో ఈ వెబ్ సిరీస్‌పై తెలుగు ప్రేక్షకుల దృష్టి పడింది. ఈ సిరీస్‌పై సమంత ఎంతో నమ్మకం పెట్టుకుంది. ``గతంలో వెబ్ సిరీస్ అవకాశాలు చాలా వచ్చాయి. కానీ తిరస్కరించాను. వెబ్‌సిరీస్‌లో దర్శకద్వయం రాజ్ డీకే నా పాత్రను ఉన్నతంగా తీర్చిదిద్దారు. అది నచ్చే నటించడానికి అంగీకరించా.
ట్రైలర్‌కు వస్తోన్న ప్రశంసలు చూస్తుంటే విడుదలకు ముందే నా పాత్ర విజయవంతమైందనే అనుభూతి కలుగుతోంది’ అని ఆనందపడిపోతోంది సమంత. `ఫ్యామిలీమెన్`లో మనోజ్ బాజ్‌పేయ్ ప్రధాన పాత్ర పోషించారు. తెలుగులో ఆ పాత్ర ఎవరు చేస్తే బాగుంటుంది? అని అడిగితే... `ఇంకెవరు మా మామ.. నాగార్జున` అని టక్కున సమాధానం చెప్పేసింది. అన్నట్టు ఫ్యామిలీమెన్ 3 సీజన్ కూడా ఉందని సమాచారం. మరి అందులో అయినా నాగార్జున ఎంట్రీ ఇస్తారేమో చూడాలి.