టాలీవుడ్ లో అత్యంత క్రేజీ కాంబినేషన్లతో, భారీ బడ్జెట్లతో సినిమాలు తీస్తున్న సంస్థ... మైత్రీ మూవీస్. తెలుగులోనే కాదు... దేశ వ్యాప్తంగానూ ఒకేసారి ఇన్ని క్రేజీ ప్రాజెక్టులు తెరకెక్కిస్తున్న నిర్మాణ సంస్థ మరోటి లేదు. ఈ సంక్రాంతికి ఒకేసారి రెండు సినిమాల్ని రిలీజ్ చేస్తోంది మైత్రీ. ఇలా ఒకే సీజన్‌లో రెండు భారీ సినిమాలు రిలీజ్ చేసిన ఘనత కూడా మైత్రీకే దక్కుతుంది. ఈ సంక్రాంతి.. మైత్రీకి చాలా కీలకమైన సీజన్. మునిగినా.. తేలినా ఈ సంక్రాంతితో తేలిపోతుంది.
వాల్తేరు వీరయ్య కోసం మైత్రీ మూవీస్ దాదాపుగా రూ.140 కోట్లు ఖర్చు పెట్టినట్టు టాక్. వీర సింహారెడ్డి కోసం మరో రూ.110 కోట్లు అయ్యిందట. అంటే.. మొత్తం కలిపి రూ.250 కోట్లు. చాలా ఏరియాల్లో సినిమాని అమ్మేశారు. బిజినెస్ బాగానే జరిగింది. కానీ పెట్టుబడి తిరిగి రావాలంటే మాత్రం... కచ్చితంగా ఈ సినిమాలు రెండూ హిట్టవ్వాల్సిందే. ఈ రెండు సినిమాలూ రూ.300 కోట్లు సాధిస్తే గానీ, మైత్రీ మూవీస్ ఒడ్డున పడదు. చిరంజీవి సినిమాలకు మంచి టాక్ వస్తున్నా.. జనాలు థియేటర్లకు రాని పరిస్థితిని `గాడ్ ఫాదర్`లో చూశాం. బాలయ్యది మరో టైపు. తన సినిమాలు ఎప్పుడు బ్లాక్ బస్టర్లు అవుతాయో, ఎప్పుడు డిజాస్టర్లుగా మారతాయో చెప్పలేని పరిస్థితి. బోయపాటి శ్రీనుతో సినిమా చేసిన తరవాత.. మరో హిట్టు కొట్టడానికి బాలయ్య ఆపసోపాలు పడుతుంటాడు. ఈ అంశాలు ఈ రెండు చిత్రాలకూ ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంది. కాకపోతే.... ఇది సంక్రాంతి సీజన్. ఈ సీజన్‌లో పెద్ద సినిమాలకు మంచి గిరాకీ ఉంటుంది. సినిమా హిట్టయితే మాత్రం వసూళ్ల వర్షం కురవడం ఖాయం. అందుకే మైత్రీ మూవీస్ కూడా రిలాక్స్ గా ఉంది.