ఎన్టీఆర్ బయోపిక్‌ని వివాదాలు వెంటాడుతున్నాయి. ఈ మధ్యనే ఈ సినిమా దర్శకుడు తేజ నుండి క్రిష్ చేతికి వచ్చింది. తాజాగా సినిమాలో తనను అభ్యంతరకరంగా చూపించబోతున్నారంటూ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు ఆరోపిస్తున్నారు. సినిమాపై అభ్యంతరాలు లేవదీస్తూ దర్శకుడు క్రిష్‌తో పాటు హీరో, నిర్మాత అయిన బాలకృష్ణకు నోటీసులు పంపారు.
ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానంలో నాదెండ్ల భాస్కరరావు పాత్ర చాలా కీలకం. తెలుగు దేశం పార్టీ తనదే అని చెప్పారాయన. ఎన్టీఆర్ అనారోగ్యంతో విదేశాలకు వెళ్లి వైద్య చికిత్స పొందుతున్నప్పుడు తెలుగు దేశం పార్టీని లాగేసుకుని ముఖ్యమంత్రి అయ్యారు నాదెండ్ల. కొద్ది రోజులే ఆయన ఆ పదవిలో ఉన్నారు. అయితే ఎన్టీఆర్ తనను మోసం చేశాడనీ భాస్కర్‌రావు ఆరోపిస్తుంటారు.
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్ నాదెండ్ల భాస్కరరావును ఎలా చూపిస్తారోనన్న ఉత్కంఠ కొందరిలో ఉంది. చంద్రబాబు వెన్నుపోటు ఎపిసోడ్, ఎన్టీఆర్ - లక్ష్మీ పార్వతి వివాహం ఇలాంటివెన్నో ఎన్టీఆర్ జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు. అసలు వివాదానికే తావివ్వకుండా ఎన్టీఆర్ బయోపిక్ తీయగలరా? అనే చర్చ ఎన్టీఆర్ అభిమానుల్లో జరుగుతూనే ఉంది.
ఇప్పుడే ఇన్ని వివాదాలొస్తే, ముందు ముందు ఈ సినిమా ఇంకెన్ని వివాదాలు చూడాల్సి వస్తుందో.!