మొన్నామధ్య నాగబాబు ట్విట్టర్‌లో చేసిన కామెంట్లు వివాదాస్పదం అయ్యాయి. గాంధీని హత్య చేసిన గాడ్సేని దేశ భక్తుడిగా వర్ణించడం చాలామంది మనసుల్ని నొప్పించింది. కొంతమంది ఆయనపై పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. ఆ వివాదం నుంచి తేరుకోకముందే.. ఆయన మరో ట్వీట్ చేశారు. ఈసారి కూడా ఆ ట్వీటు గాంధీ చుట్టూతిరగడం విశేషం. “సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర ఆజాద్, పివి నరసింహారావు, అబ్దుల్ కలాం, వాజపేయి మరియు ఇతరుల చిత్రాలు మన దగ్గర కరెన్సీ మీద ఉండాలి. ఇతర నాయకులను మనం మరచిపోకూడదు” అని ఆయన ట్విట్ చేశారు.
“గాంధీ ఈ రోజు జీవించి ఉంటే, అతను కూడా దానిని ఆమోదించేవాడు. మన గొప్ప నాయకుల పేర్లను మాత్రమే గుర్తుంచుకునే రోజుల్లో మనం జీవిస్తున్నాము, ప్రభుత్వం వారి ఫోటోలు కరెన్సీ నోట్ల మీద ముద్రించి అలాంటి వారి ముఖాలను మన భావి తరాలకు పరిచయం చెయ్యాలి, ” అంటూ మరో ట్వీట్ వేశారు. కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ మాత్రమే ఎందుకు? అనేది నాగబాబు ఒక్కడి మాటే కాదు. చాలామంది చాలా కాలంగా వాదిస్తున్నారు. కాబట్టి.. నాగబాబుకి వాళ్ల నుంచి కొంత మద్దతు లభించొచ్చు. అందుకే ఈసారి నాగబాబు ట్వీట్లకు అంత వ్యతిరేకత రాలేదు. వివాదాలూ తలెత్తలేదు.
కాకపోతే.. వరుసగా రెండోసారీ గాంధీని దృష్టిలో ఉంచుకుని ట్వీట్ చేయడం ఒక్కటే.. ఆసక్తిని, అనుమానాన్నీ రేకెత్తిస్తోంది. నాగబాబు గాంధీని వదిలేట్టు లేడు, దీని వెనుక మతలబు ఏదో ఉంది.. అంటూ కొంతమంది నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Indian కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్ర బోస్,అంబేద్కర్, భగత్ సింగ్,చంద్ర శేఖర్ ఆజాద్,లాల్ బహదూర్ ,పీవీ నరసింహారావు,అబ్దుల్ కలాం,సావర్కార్,వాజపేయ లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది.ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనము మర్చిపోకూడదని ఒక ఆశ.
— Naga Babu Konidela (@NagaBabuOffl) May 22, 2020