సోషల్ మీడియాలో మహ యాక్టీవ్ గా ఉండేవాళ్లలో నాగబాబు ఒకరు. ట్విట్టర్, యూ ట్యూబ్.. ఏదైనా గానీ, తన వాయిస్ గట్టిగానే వినిపిస్తుంటాడు. తాజాగా... లాక్ డౌన్‌పై నాగబాబు గళం విప్పాడు. తన ఛానల్ `నా ఛానల్ నా ఇష్టం`లో లాక్ డౌన్ నిర్ణయంపై ప్రభుత్వాల్ని ఏకి పాడేసే ప్రయత్నం చేశాడు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటిస్తారన్న వార్తలు ఊపందుకున్నాయి. లాక్ డౌన్ కోసం కేంద్రం మరోసారి సన్నాహాలు చేస్తోందని, కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్‌ని ఇంకా గట్టిగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని వార్తలొస్తున్నాయి. వీటిపై నాగబాబు స్పందించాడు. మరోసారి లాక్ డౌన్ గనుక ప్రకటిస్తే అది చారిత్రక తప్పిదం అవుతుందని హెచ్చరించాడు. అటు కేంద్రం గానీ, ఇటు రాష్ట్రాలు గానీ, మరోసారి లాక్ డౌన్ ప్రకటిస్తే ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతుందని, ఇప్పటికే ప్రజలు అలసిపోయారని, వాళ్ల సహనాన్ని పరీక్షించొద్దని హెచ్చరించాడు. 90 రోజుల లాక్ డౌన్ లో కేంద్రం ఏం సాధించిందని ప్రశ్నించారు. నాకు కరోనా వస్తే వచ్చిందన్న పరిస్థితికి ప్రజలు రాకూడదని, అది చాలా ప్రమాదకరమని, అలాంటి వాతావరణాన్ని దూరం చేయాలని ప్రభుత్వాల్ని కోరారు నాగబాబు. ఆయన వ్యాఖ్యలు, సూచనలు కాస్త రీజనబుల్ గానే ఉన్నాయి. కాకపోతే.. పవన్ కల్యాణ్ ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. జనసేన - బీజేపీ కలిసి పనిచేయాలన్న నిర్ణయానికి వచ్చాయి. ఇలాంటి సమయంలో.. కేంద్రంపై నాగబాబు ఘాటు విమర్శలు చేయడం పవన్ అభిమానులకు మింగుడు పడని విషయమే.