యువ దర్శకుడు తరుణ్ భాస్కర్‌పై ఇప్పుడు మహేష్ బాబు అభిమానులు మండి పడుతున్నారు. మహేష్‌కీ.. తరుణ్‌కీ ఏమాత్రం సంబంధం లేదు. కానీ తరుణ్ భాస్కర్ చేసిన కొన్ని ట్వీట్లు.... ఇప్పుడు మహేష్ అభిమానులకు కోపం తెప్పించాయి. అయితే ఆ ట్వీట్లలో మహేష్ ప్రస్తావన ఎక్కడా తీసుకురాలేదు తరుణ్. కానీ.. మహేష్ ఫ్యాన్స్ మాత్రం తరుణ్‌పై ఫైర్ అవుతూ, తరుణ్‌ని ట్రోల్ చేయడం ఆసక్తిగా మారింది. అసలు విషయం ఏమిటంటే.. ఇటీవల విడుదలైన మలయాళ సినిమా `కప్పెల` విమర్శకుల ప్రశంసల్ని అందుకుంటోంది.
టాలీవుడ్ ప్రముఖులు, దర్శకులు ఈ సినిమాని మెచ్చుకుంటున్నారు. కప్పెల సినిమా తరుణ్‌కీ నచ్చింది. ఆ విషయాన్ని తన ట్విట్టర్‌లో చెబుతూ పరోక్షంగా తెలుగు సినిమాలపై, తెలుగు హీరోలపై, ఇక్కడి కమర్షియాలిటీపై సెటైర్లు వేశాడు. ''హీరో పిచ్చోడిలా గట్టిగా రీసౌండ్ చేసుకరుంటూ అరవడు. అందరి కంటే స్మార్ట్‌గా ప్రతి డైలాగ్‌లో సామెత చెప్పడు. ఎక్సట్రీమ్ స్లోమోషన్‌లో ఫిజిక్స్ ఫెయిలయ్యేలా ఫైట్లు వుండవు. ప్రతీ రెండు నిమిషాలకు హీరో ఎంట్రీ వుండదు. చివరి పది నిమిషాల్లో రాండమ్‌గా రైతుల గురించో, సైనికుల గురించో, దేశం గురించో మెసేజ్ వుండదు. మరి దీన్ని కూడా సినిమా అంటారు మరి ఆ ఊర్లో'' అంటూ తరుణ్ ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.
ఆగడు, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, శ్రీమంతుడులో మహేష్ పాత్ర చిత్రీకరణ ఇలానే ఉంటుంది. అందుకే... తమ హీరోనే ఆ మాటలన్నాడని... తరుణ్ పై తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు మహేష్ ఫ్యాన్స్. నిజానికి.. ప్రతీ తెలుగు హీరో సినిమా ఇలానే ఉంటుంది. ఆ మాటకొస్తే.. అందరి హీరోలపై తరుణ్ చురకలు అంటించినట్టే. కానీ మహేష్ ఫ్యాన్సే ఎక్కువ ఫీలైపోతున్నారు.