మెగా బ్రదర్ నాగబాబు, సోషల్ మీడియా వేదిక కేంద్ర ప్రభుత్వానికి కరోనా వ్యాప్తిపై ఓ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలు చెప్పినట్లు ప్రజలు నడచుకోవడంలేదనీ, ఇది సాటి మనిషికి ప్రమాదం కలిగించే పరిస్థితి అనీ, వున్న పళంగా మిలిటరీని దించి రోడ్లపై జనాల్ని కంట్రోల్ చేయించాలని నాగబాబు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. నాగబాబు మాత్రమే కాదు, చాలామంది సెలబ్రిటీలు ‘లాక్ డౌన్’ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని కోరుతున్నారు. ప్రభుత్వాలు ఎంతగా మొత్తుకుంటున్నా జనం మాత్రం రోడ్ల మీదకు రావడం మానడంలేదు. రోడ్ల మీదకు వచ్చేందుకు ప్రభుత్వం కొన్ని నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ, వాటిని తుంగలో తొక్కేస్తున్నారు.
సమాజం అంతా ఒక్కటై, కరోనా వైరస్‌ని తరిమికొట్టాల్సిన సందర్భమిది. ఎవరికి వారు స్వీయ నిర్బంధం విధించుకుంటే తప్ప, కరోనా మహమ్మారిని తరిమికొట్టలేం. ఇంట్లో ఖాళీగా కూర్చుని ఏం చేయాలి.? అన్నదానిపై హీరోలు, హీరోయిన్లు ఎప్పటికప్పుడు తమకు తోచిన రీతిలో సలహాలు ఇస్తున్నారు. కొందరు ఫిట్‌నెస్ మీద సలహాలు ఇస్తోంటే, ఇంకొందరు అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఆ రకంగానూ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నారు. మరి, అలాంటప్పుడు వారిని అభిమానించే అభిమానులు, ప్రజలు.. వాళ్ళు చెప్పే మాటలు కూడా వినాలి కదా.! ఇదే నాగబాబు కూడా చెబుతున్నది. నాగబాబు సినీ నటుడు మాత్రమే కాదు, జనసేన పార్టీ నేతల కూడా.