తెలుగు టెలివిజన్ రంగంలో బిగ్గెస్ట్ సూపర్ హిట్ కామెడీ షో అంటే అది 'జబర్‌దస్త్' మాత్రమే. 'జబర్‌దస్త్ - ఎక్స్ ట్రా జబర్‌దస్త్' పేరుతో వారంలో రెండు రోజులపాటు ప్రసారమయ్యే ఈ కామెడీ షో, ఎంతోమంది కమెడియన్లకు మంచి బ్రేక్ ఇచ్చింది. కొందరు కమెడియన్లు ఇంకా జబర్‌దస్త్‌లో కొనసాగుతోంటే, ఇంకొందరు మాత్రం జబర్‌దస్త్‌ని వదిలేసి సినిమాల్లో కెరీర్‌ని ఘనంగా కొనసాగిస్తున్నారు. ఇదిలా వుంటే, మొదటి నుంచీ ఇప్పటిదాకా రోజా, నాగబాబు ఈ షోకి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. కొన్ని ప్రత్యేక కారణాలతో కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే ఈ ఇద్దరూ మిస్ అయ్యారు తప్ప.. జబర్‌దస్త్ టీమ్‌తో ఈ ఇద్దరికీ ఎలాంటి అభిప్రాయ బేధాలూ రాలేదు.
అయితే, గత కొద్ది రోజులుగా జబర్‌దస్త్ టీమ్‌కీ, నాగబాబుకీ మధ్య పొరపచ్చాలు పెరిగిపోయాయట. నితిన్ భరత్ అనే దర్శక ద్వయం ఎప్పుడైతే మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్‌ని వీడిందో, ఆ తర్వాత నుంచే సీన్ మారిపోయిందని తెలుస్తోంది. అయితే, ఈటీవీ యాజమాన్యం, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్, నాగబాబుని గతంలో బుజ్జగించడం జరిగిందనీ, ఆ తర్వాత వివాదం సద్దుమణిగిందనీ అంటున్నారు. మళ్ళీ ఏమయ్యిందోగానీ, ఇటీవల ఇంకోసారి అభిప్రాయ బేధాలు తలెత్తడంతో నాగబాబు, షోకి గుడ్ బై చెప్పేశారట.
మల్లెమాల టీమ్, ఈటీవీ ఎంతగా ప్రయత్నిస్తున్నా నాగబాబు అందుబాటులోకి రావడంలేదట. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, నాగబాబు ఇకపై జబర్‌దస్త్‌లో కన్పించబోరనీ, శాశ్వతంగా ఆ షోకి ఆయన గుడ్ చెప్పేశారనీ తెలుస్తోంది. ఒకటి రెండు వారాలుగా ప్రసారమవుతున్న ఎపిసోడ్స్ గతంలో చిత్రీకరించినవేనట.