''నువ్వు నన్ను ఒకటంటే.. నేను నిన్ను రెండంటా'' అంటుంది లోకం. ఎప్పటికప్పుడు రివైంజులు తీర్చుకోవడానికి ఎవరికి వారు ఎదురు చూస్తుంటారు. చిత్రసీమలోనూ అంతే. ఎవరి టైమ్ వచ్చినప్పుడు వాళ్లు.. తమ ప్రతాపం చూపిస్తుంటారు. ఇప్పుడు నాగచైతన్య కూడా అదే చేస్తున్నాడు. దర్శకుడు పరశురామ్ పై రివైంజ్ తీర్చుకుంటున్నాడు.
నాగచైతన్య - పరశురామ్ కాంబినేషన్ లో ఓ సినిమా ఓకే అయిన సంగతి తెలిసిందే. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'నాగేశ్వరరావు' అనే టైటిల్ అనుకుంటున్నారు. 'సర్కారు వారి పాట' తరవాత పరశురామ్ దర్శకత్వంలో రూపొందే చిత్రమిదే. థ్యాంక్యూ తరవాత.. ఈ సినిమాకి డేట్లు ఇస్తానని నాగచైతన్య ముందే చెప్పాడు. సో.. ఈ కాంబో రేపో, మాపో సెట్స్‌పైకి వెళ్లాలి. కానీ ఇంత వరకూ ఎలాంటి అప్ డేటూ లేదు.
ఇటీవల తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు నాగచైతన్యకు ఓ కథ వినిపించాడు. ఈ కాంబో ఓకే అయిపోయింది. ఈ కథ నాగచైతన్యకు విపరీతంగా నచ్చడంతో, వెంటనే పట్టాలెక్కించేద్దాం అన్నాడట. అంటే... పరశురామ్ సినిమాని తాత్కాలికంగా పక్కన పెట్టినట్టే. నాగచైతన్య సడన్ గా ఈ నిర్ణయం తీసుకోవడానికి వేరే కారణం ఉంది. పరశురామ్ తో పాత లెక్కలు ఉన్నాయి.
గీత గోవిందం అవ్వగానే నాగచైతన్యతో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు పరశురామ్. దాదాపు కథ ఓకే అయిపోయింది. ఇక సెట్స్‌పైకి వెళ్లడమే తరువాయి. అలాంటి దశలో పరశురామ్ కు మహేష్ నుంచి ఆఫర్ వచ్చింది. నాగచైతన్య కంటే మహేష్ స్టార్ డమ్ ఎక్కువ కదా.? అందుకే చైతూ సినిమా పక్కన పెట్టి, మహేష్ సినిమాని పట్టాలెక్కించాడు పరశురామ్. దాంతో.. నాగచైతన్య మరో ప్రాజెక్టుని సెట్ చేసుకోవాల్సివచ్చింది. ఇప్పుడు.. నాగచైతన్యకు టైమ్ వచ్చింది. అందుకే పరశురామ్ ని పక్కన పెట్టి మరో ప్రాజెక్టు ఓకే చేశాడు. చైతూ వచ్చేంత వరకూ ఇప్పుడు పరశురామ్ ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే.. చైతూ స్వీట్ రివైంజ్ డ్రామా.