సినిమా విజయంలో హీరో - హీరోయిన్ల కెమిస్ట్రీ చాలా కీలకం. ముఖ్యంగా ప్రేమకథల్లో. హీరో పక్కన సరి జోడీ తీసుకురాకపోతే.. చాలా కష్టం. అందుకే హీరోయిన్ల వేటలో అంతగా శ్రమిస్తుంటారు దర్శకులు. విక్రమ్ కె.కుమార్ కూడా.. పక్కా పర్‌ఫెక్షనిస్టు. తనకు కావల్సిన నటీనటుల్నే ఎంచుకుంటాడు. అయితే... తన కొత్త సినిమా `థ్యాంక్యూ` విషయంలో విక్రమ్ రాజీ పడిపోతున్నాడేమో అనిపిస్తోంది. నాగచైతన్యతో విక్రమ్ కె.కుమార్ `థ్యాంక్యూ` అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలుంటార్ట. ఓ కథానాయికగా సమంతని ఎంచుకుంటారని ప్రచారం జరిగింది. అయితే సమంత డ్రాప్ అవ్వడంతో.. ఆ స్థానంలో మరో కథానాయికని వెదికే పనిలో పడ్డాడు విక్రమ్. అయితే ఇప్పుడు మిగిలిన ఇద్దరూ ఖరారైపోయారని టాక్. అవికా గోర్, మాళవికా నాయర్ లను ఎంచుకున్నారని సమాచారం. అవికా గోర్ గురించి టాలీవుడ్ మర్చిపోయి చాలా రోజులైంది. మాళవిక చేతిలోనూ హిట్ సినిమాల్లేవు.
పైగా మాళవిక గ్లామర్ పాత్రలు చేయనే చేయదు. మరి.. వీళ్ల కెమిస్ట్రీ ఎలా వర్కవుట్ అవుతుందో ఏమో..? ఫామ్ లో లేని హీరోయిన్లని తీసుకుని విక్రమ్ ఏం చేస్తాడో అనే టెన్షన్ అక్కినేని అభిమానుల్లో మొదలైపోయింది. సమంత ప్లేసులో వీళ్లని తీసుకున్నాడా, లేదంటే ఈ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ కచ్చితంగా ఉంటుందా అనేది తెలియాల్సివుంది.