రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన 'పీఎస్‌వీ గరుడవేగ' సినిమా చాలా బాగుందనీ హీరో వెంకటేష్ స్పందించారు. తాజాగా ఈ సినిమాని చూసిన వెంకటేష్ మంచి సినిమాతో రాజశేఖర్ రీ ఎంట్రీ ఇచ్చారనీ, వెంకటేష్ అభినందించారు. చాలా కాలం తర్వాత ఓ మంచి యాక్షన్ థ్రిల్లర్‌ని చూశాననీ వెంకీ అన్నారు. అంతేకాదు, ఈ సినిమా యూనిట్‌కి అభినందనలు తెలుపుతూ ఓ వీడియోని పోస్ట్ చేశారు వెంకీ. సినిమా చాలా బాగుందనీ, సినిమాలో రాజశేఖర్ నటన, యాక్షన్ సన్నివేశాలు చాలా బాగా తెరకెక్కించారనీ వెంకీ వీడియోలో తెలిపారు. బాగా పరిశోధించి ఈ యాక్షన్ థ్రిల్లర్‌ని ఇంత అద్భుతంగా తెరకెక్కించిన డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుకు వెంకటేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే యాక్షన్ సన్నివేశాలను తాను బాగా ఎంజాయ్ చేశానని వెంకీ అన్నారు. వెంకీ స్పందనకు రాజశేఖర్ ధన్యవాదాలు తెలిపుతూ, 'ధన్యవాదాలు ప్రియమైన వెంకీ' అని ట్వీట్ చేశారు.
మరో పక్క తాజాగా ఈ చిత్రాన్ని చూసిన వెంకటేష్ మేనల్లుడు నాగచైతన్య కూడా ఓ వీడియో ద్వారా తన అభిప్రాయాన్ని తెలుపుతూ, చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు. ఇలా ఒకేసారి మేనమామ, మేనల్లుడు నుండి 'గరుడవేగ' సినిమాకి ప్రశంసలు దక్కాయి. ఇప్పటికే ఈ సినిమాకి పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాగా వెంకీ, నాగ చైతన్య కలిసి త్వరలో ఓ మల్టీ స్టారర్‌లో నటించబోతున్నారు. ప్రస్తుతం చైతూ 'సవ్యసాచి' సినిమాలో నటిస్తున్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తర్వాత మారుతి దర్శకత్వంలో చైతూ ఓ సినిమా చేయాల్సి ఉంది.