సక్సెస్ ఇచ్చే ఆనందం ఎలా ఉంటుందో యంగ్ హీరో నాగశౌర్యని చూస్తుంటే తెలుస్తోంది. 'ఛలో' సినిమా సక్సెస్‌ని ఆస్వాదిస్తున్నాడు ప్రస్తుతం నాగశౌర్య. మాస్ హీరో అనిపించుకోవడానికి నాగశౌర్య చేసిన కృషి ఫలించిందనే చెప్పాలి ఈ సినిమాతో. 'ఛలో' నాగశౌర్యకి ఓ మంచి మాస్ హిట్‌ని తెచ్చి పెట్టింది. ఇదే జోరుతో మనోడు కాశీవిశ్వనాధ్ దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు.
ఈ సినిమాకి క్రేజీ టైటిల్‌ని ఫిక్స్ చేశారట చిత్ర యూనిట్. అదే 'గురువారం మార్చి 1'. ఏంటిది..! ఈ సౌండ్ ఎక్కడో విన్నట్లుందే అనుకుంటున్నారు కదా. అవును 'దూకుడు'లో మహేష్‌బాబు చిందేసిన పాటలోని పల్లవే ఇది. స్టార్ హీరోల హిట్ సినిమాల పాటల్లోని ఒక్కో పదాన్ని యంగ్ హీరోలు తమ సినిమాలకు టైటిల్స్‌లా తగిలించుకోవడం ఎప్పటి నుండో వస్తున్న సాంప్రదాయమే. ఆ సాంప్రదాయాన్ని మన నాగశౌర్య కూడా ఫాలో చేస్తున్నాడు కాబోలు అనిపిస్తోంది. ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న కాశీ విశ్వనాధ్ గతంలో 'నువ్వు లేక నేను లేను', 'తొలి చూపులోనే' చిత్రాలను తెరకెక్కించారు.
ఆ తర్వాత ఆయన డైరెక్షన్‌కి తాత్కాలికంగా టాటా చెప్పేసి, నటనలో బిజీ అయిపోయారు. అయితే ఇప్పుడు నాగశౌర్య కోసం మళ్లీ లాంగ్ గ్యాప్ తర్వాత డైరెక్షన్‌లోకి అడుగు పెట్టాడు. అయితే ఈయనకి డైరెక్షన్ ఫీల్డ్‌లో పాతికేళ్ల అనుభవం ఉందిలెండి. ఇక నటన విషయానికి వస్తే, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా పలు చిత్రాల్లో నటించారు. తండ్రి పాత్రల్లో తనదైన శైలితో మెప్పించారు. తాజాగా నాగశౌర్య కోసం ఈయన ఓ మంచి స్క్రిప్టు తయారు చేశారట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదికెళ్లనుంది. మరో వైపు నాగశౌర్య 'కణం' సినిమాలో నటిస్తున్నాడు.