ప్రతీసారీ... ఓ డిఫెరెంట్ జోనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నాగశౌర్య. `లక్ష్య` స్పోర్ట్స్ డ్రామాలో నటించిన శౌర్య... ఆ వెంటనే `వరుడు కావలెను`తో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేశాడు. మొన్నటి `కృష్ణ వ్రింద విహారి`తో డిఫరెంట్ లవ్ స్టోరీ ట్రై చేశాడు. ఇప్పుడు మరోసారి జోనర్ మార్చాడు. ఈసారి.. యాక్షన్ ఎంటర్టైనర్లోకి దిగాడు. శౌర్య ఇప్పుడు ఓ కొత్త సినిమా ఒప్పుకొన్నాడు. అరుణాచలమ్ అనే ఓ డెబ్యూ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చాడు. ఈ సినిమాకి వైష్ణవి ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇదో యాక్షన్ ఎంటర్టైనర్.
నాగశౌర్యని కొత్తగా చూపించబోతున్నామని, తన మేకొవర్ మరో స్థాయిలో ఉంటుందని చిత్రబృందం తెలిపింది. `కృష్ణ వ్రింద..` తరవాత శౌర్య ఒప్పుకొన్న సినిమా ఇదే. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో ప్రకటిస్తారు. `ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి` సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది.