`లైగర్` కష్టాలూ, నష్టాలూ పూరి జగన్నాథ్‌ని వెంటాడుతున్నాయి. బయ్యర్లు పూరిపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో పూరి కూడా రివర్స్ ఎటాక్ ఇచ్చాడు. తనని బెదిరిస్తే లొంగేరకం కాదని, అలాంటి వారికి పైసా ఇవ్వనని వార్నింగ్ ఇచ్చాడు. అయితే పూరి సెటిట్‌మెంట్ బయ్యర్లతోనే పూర్తవదు. ఈ సినిమాలో హీరోగా నటించిన విజయ్ దేవరకొండకీ సెటిల్ చేయాల్సింది ఉంది. ఈ సినిమా కోసం విజయ్‌కి ఇప్పటి వరకూ పారితోషికం చెల్లించలేదని బయట టాక్. సినిమా రిలీజ్ తరవాత.. పారితోషికం ఇస్తామని పూరి, ఛార్మి చెప్పారని, ఇప్పుడు విజయ్ వారిద్దరికీ ఫోన్లు చేస్తుంటే ఒక్కరూ స్పందించడం లేదని, ఈ విషయంలో విజయ్ దేవరకొండ కూడా.. ఫిల్మ్ ఛాంబర్నీ, సినీ పెద్దలనీ ఆశ్రయిస్తున్నాడని సమాచారం అందుతోంది.
బయ్యర్లకు సెటిల్మెంట్ చేయడానికి వారం, పదిరోజుల సమయం అడిగాడు పూరి. విజయ్ కి కూడా సరిగ్గా అప్పుడే సెటిల్ చేయబోతున్నాడట. పూరికి సంబంధించిన ఓ విలువైన ప్రాపర్టీ ఇప్పుడు అమ్మకానికి పెట్టారు. ఆ డబ్బులతో ఈ వ్యవహారం సెటిల్ చేయాలని చూస్తున్నాడు పూరి. అయితే పూరి ఇప్పుడు హైదరాబాద్ లో లేడు. ఇంకా ముంబైలోనే మకాం పెట్టాడు. పూరి హైదరాబాద్ వస్తే.... బయర్లు మరోసారి చుట్టుముట్టే ప్రమాదం ఉంది. అందుకే ముంబైలో ఉండగానే ఈ విషయాన్ని సెటిల్ చేసుకుందామనుకొంటున్నాడు పూరి.