తనయుడు అక్కినేని అఖిల్ హీరోగా 'హలో' సినిమా పనుల్లో ఓ పక్క బిజీగా వుంటూనే, ఇంకోపక్క 'ఆఫీసర్' సినిమాని వర్మ దర్శకత్వంలో నాగార్జున షురూ చేసేసి అప్పట్లో అందర్నీ ఆశ్చర్యపరిచాడు 'కింగ్' అక్కినేని నాగార్జున.
వేగంగా సినిమాలు చేయడంలో, సీనియర్ హీరోలందరిలోకీ నాగ్ మంచి జోరు చూపిస్తోన్న సంగతి తెల్సిందే. 'ఆఫీసర్' నిర్మాణం ఇలా పూర్తయ్యిందో లేదో, యంగ్ హీరో నానితో కలిసి చేస్తోన్న మల్టీస్టారర్ సినిమాని నాగార్జున పట్టాలెక్కించేశాడు. దీని తర్వాత మరో రెండు సినిమాల్ని నాగార్జున లైన్‌లో పెట్టేస్తున్నాడట. హీరోగా తన సినిమాల్ని తాను చూసుకోవడమే కాకుండా, ఇద్దరు కుమారులు అఖిల్, నాగచైతన్యల సినిమాల విశేషాల్నీ జాగ్రత్తగా డీల్ చేస్తున్న నాగార్జునని చూస్తే ఎవరికైనా చిన్నపాటి అసూయ, ఆశ్చర్యం కలగకమానవు.
నాగచైతన్య విషయంలో పెద్దగా 'కింగ్' నాగార్జునకి సమస్యల్లేవు. కెరీర్‌ని నాగచైతన్య బాగానే బిల్డప్ చేసుకున్నాడిప్పుడు. అఖిల్‌తోనే సమస్య వస్తోంది. స్టార్ హీరో అయ్యే లక్షణాలున్నా, అఖిల్ సినిమా సినిమాకీ తీసుకుంటోన్న గ్యాప్, కథల ఎంపికలో చూపుతున్న తడబాటు.. ఇవన్నీ నాగార్జునని ఇబ్బంది పెట్టేస్తున్నాయి. తొలి సినిమా 'అఖిల్' డిజాస్టర్‌గా మిగలడంతో, రీ-లాంఛ్ అంటూ 'హలో' సినిమా అఖిల్‌తో నాగార్జున చేయించాడు. కానీ, అదీ ఆశించిన విజయాన్నివ్వలేదు. దాంతో, ఇప్పుడు యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి చేతుల్లో అఖిల్‌ని పెట్టాడు నాగార్జున.
తండ్రి కెరీర్‌కి బ్రేకుల్లేవు.. పెద్ద కొడుకు నాగచైతన్య కూడా దూకుడు మీదే వున్నాడు. అఖిల్ మాత్రం కెరీర్‌లో వేగం పుంజుకోలేకపోతున్నాడు. ఆ ఒక్కటే నాగార్జున టెన్షన్.