కింగ్ అక్కినేని నాగార్జున సూపర్ హిట్ సినిమాల్లో 'సోగ్గాడే చిన్నినాయన' కూడా ముందు వరుసలో నిలుస్తోంది. 2015 లో విడుదలైన ఈ సినిమా కుటుంబ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలో నాగార్జున చేసిన బంగార్రాజు పాత్రకు విశేషమైన స్పందన లభించింది. దీంతో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, నాగార్జున - నాగ చైతన్య కాంబినేషన్ లో ఆ చిత్రానికి సీక్వెల్ తీయబోతున్న సంగతి తెలిసిందే.
అయితే ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ సినిమా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సోదరుడు మరణం కారణంగా నాగ్ 'బిగ్ బాస్-3'తో బిజీగా ఉండటం కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. దాంతో అనుకున్న సమయానికి బంగార్రాజు సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇక జనవరి మూడో వారంలో సినిమాను మొదలుపెట్టి, వచ్చే ఏడాదే వేసవిలో బంగార్రాజుని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.
కాగా ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ, ఈ చిత్ర సంగీత దర్శకుడు అనుప్ రూబెన్స్‌తో పాటు సాంగ్స్ కంపోజిషన్స్ లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బంగార్రాజు సినిమా స్క్రిప్ట్ పనులు ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయట. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. మరి నాగ్ ఈ సారి హిట్ కొడతారా చూడలి. అయితే గత చిత్రం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా వచ్చిన `మన్మథుడు 2' బాక్సాఫీస్ వద్ద ప్లాప్ చిత్రంగా నిలిచింది. దాంతో నాగార్జున తన తరువాత సినిమాల స్క్రిప్ట్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటున్నారు.