ఇప్పుడు అందరి దృష్టీ అక్టోబరు 5పై పడింది. చిత్రసీమకు అత్యంత కీలకమైన దసరా సీజన్లో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. ఒకటి చిరంజీవి గాడ్ ఫాదర్ అయితే, మరోటి నాగార్జున నటించిన `ది ఘోస్ట్`. రెండు సినిమాల్నీ అక్టోబరు 5నే విడుదల చేయాలని ఫిక్సయ్యారు.
చిరు, నాగ్ ఇద్దరూ మంచి మిత్రులు. ఒకరి సినిమాపై మరొకరు పోటీకి వెళ్లడానికి ఏమాత్రం ఇష్టపడరు. నాగ్ అయితే అసలు ఈ రిస్క్ చేయడు. ఎందుకంటే... ఇద్దరూ ఎంత సమకాలికులైనా.. నాగ్ తో పోలిస్తే చిరు మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. చిరు సినిమా ఓపెనింగ్స్ ఎప్పుడైనా అదిరిపోతాయి. నాగ్ సినిమా అలా కాదు. సినిమా బాగుంటే వెళ్తారు, లేదంటే లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో చిరుపై నాగ్ పోటీకి దిగడం రిస్కే. అందుకే ఘోస్ట్ రిలీజ్ డేట్ మారుతుందని అందరూ అంచనా వేశారు. కానీ... నాగ్ ఇప్పుడు తగ్గడం లేదు. ఎలాగూ రిలీజ్ డేట్ ప్రకటించేశాం కదా అని చిరుతో ఢీ కొట్టడానికి రెడీ అయిపోతున్నాడు. ఈసినిమాని అక్టోబరు 5న ఎట్టిపరిస్థితుల్లోనూ రిలీజ్ చేస్తామనే చిత్రబృందం చెబుతోంది. సో.. చిరు, నాగ్ ల పోటీ తప్పదన్నమాట. దసరా పెద్ద సీజన్. వరుసగా సెలవలు వస్తాయి. కాబట్టి.. ఆ హాలీడేస్ ని క్యాష్ చేసుకోవాలని చిరు, నాగ్ భావిస్తున్నారు. అందుకే ఈ పోటీ పట్టించుకోవడం లేదు. మరి ఈ పోటీ వీళ్లకు మంచి చేస్తుందా, లేదంటే కలక్షన్లలో కోత విధిస్తుందా? అనేది తెలియాలంటే అక్టోబరు 5 వరకూ ఆగాలి.