'ఓం నమో వెంకటేశాయ' సినిమా ప్రత్యేకత ఏంటంటే, భగవంతుడ్ని స్నేహితుడిలా చూస్తుందట నాగార్జున పాత్ర. హథీరామ్‌బాబా పాత్రలో నాగార్జున నటిస్తున్నాడు ఈ సినిమాలో. భారీ అంచనాల మీద తెరకెక్కుతోన్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చిత్రం ఇది. అనుష్క, ప్రగ్యా జైస్వాల్, విమలారామన్ ఇతర ప్రధాన తారాగణం. ఈ సినిమా చేశాక నాగార్జునలో వెంకటేశ్వరస్వామి మీద అపారమైన భక్తి ఏర్పడింది. అది ఆయన మాటల్లోనే తెలుస్తోంది. 'అన్నమయ్య'లో అద్భుతమైన నటనా ప్రతిభతో ఆకట్టుకున్నాడు నాగార్జున. అంతకు మించిన విధంగా ఈ సినిమాలో తన పాత్ర ఉంటుందని ఆయన చెబుతున్నాడు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఆధ్మాతిక అద్భుతంగా ఈ సినిమా గురించి భావించవచ్చు. భారీ సెట్టింగులతో ఆహ్లాదాన్నిచ్చే విజువల్ ఎఫెక్ట్స్‌తో భక్తి పారవశ్యంలోకి తీసుకెళ్లనుందట ఈ సినిమా. 'అన్నమయ్య' సినిమాలో భక్తితో పాటు అన్ని రకాల కమర్షియల్ అంశాలు ఉంటాయి. అలాగే ఈ సినిమాలో కూడా ప్రత్యేకతలతో పాటు సినిమాకి ఉండాల్సిన అన్ని అంశాలు ఉంటాయట. నాగార్జున ఈ సినిమా విజయంపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అలాగే ఈ సినిమాలో అనుష్క పాత్ర గురించి అంతా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈశ్వరమ్మగా ఆమె పాత్ర చాలా అద్భుతంగా పోషించిందట. బాలీవుడ్ నటుడు సౌరభ్ వేంకటేశ్వరస్వామి పాత్రలో చాలా అందంగా కనిపిస్తున్నారు. భగవంతునికీ, భక్తునికీ మధ్య సన్నివేశాలు మనసుకి హత్తుకునేలా ఉండబోతున్నాయట.