బుల్లితెరపై రేపటి నుండి బిగ్‌బాస్ రియాల్టీ షో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, ఈ షోని అడ్డుకోవాలంటూ రకరకాలుగా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి ఈ షోపై. తాజాగా ఓయూ విద్యార్ధులు కూడా రంగంలోకి దిగడంతో, ఇష్యూ సీరియస్ అయ్యింది. నాగార్జున ఇంటిని ఓయూ విద్యార్ధులు ముట్టడించడంతో, ఇంకేముంది.? రేపట్నుంచి ప్రసారం కాబోయే బిగ్‌బాస్ 3 వాయిదా పడిందనే వార్తలు గుప్పుమంటున్నాయి.
ఈ విషయంలో నిజమెంతో తెలీదు కానీ, బిగ్‌బాస్ ప్రమోషన్స్ మాత్రం జోరుగానే చేస్తున్నారు. బిగ్‌బాస్ వన్ డే టు గో.. అంటూ సోషల్ మీడియాలో సందడి మొదలైంది. తొలి రోజు బిగ్‌బాస్ చూడాలని బుల్లితెర ప్రేక్షకులు ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు బిగ్‌బాస్‌ని చుట్టుముట్టిన వివాదాలన్నీ కల్పితమనీ, ఈ షో ప్రమోషన్స్‌లో ఇదీ ఓ భాగమనీ అంటున్న వారూ లేకపోలేదు.
ఏమో, ఏది నిజమో, ఏది కల్పితమో తెలీదు కానీ, రేపటి బిగ్‌బాస్ తొలి షో పై అంతటా ఉత్కంఠ నెలకొంది. రేపు సాయంత్రం 9 గంటల సమయం వరకూ ఈ ఉత్కంఠకు తెర పడేది లేదు. ఇదిలా ఉంటే, ఇంత రచ్చ జరుగుతున్నా, ఇంతవరకూ బిగ్‌బాస్ నిర్వాహకులు కానీ, హోస్ట్‌గా వ్యవహరించనున్న నాగార్జున కానీ, ఏ రకంగానూ స్పందించకపోవడం విస్తుగొలిపేలా ఉంది.