నాగార్జున నటించిన చిత్రం `వైల్డ్ డాగ్`. సాల్మన్ దర్శకుడు. షయామీ ఖేర్ కీలక పాత్రధారి. ఈసినిమా ఓటీటీలో విడుదల కావల్సింది. ఆ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ 35 కోట్లకు కొనుక్కుంది. అయితే.. ఇప్పుడు నిర్మాతలు మనసు మార్చుకున్నారు. ఓటీటీ హక్కుల్ని వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని థియేటర్‌లోనే విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 2న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. కోవిడ్ సమయంలో ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్‌కొనుక్కుంది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి.
థియేటర్లు తెరచుకున్నాయి. 100 శాతం ఆక్యుపెన్సీ లభించింది. మంచి సినిమా వస్తే.. ప్రేక్షకులు చూస్తారన్న నమ్మకం కలిగించింది. అందుకే... ఓటీటీ నుంచి ఈ సినిమాని వెనక్కి తీసుకుని, థియేటర్లో విడుదల చేయడానికి రెడీ అయ్యారు. అందుకోసం నెట్ ఫ్లిక్స్ తో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. హైదరాబాద్ లో జరిగిన గోకుల్ చాట్ బాంబు దాడుల ఘటన నేపథ్యంలో సాగే కథ ఇది. ఆ టెర్రరిస్టుల్ని పట్టుకోవడానికి `వైల్డ్ డాగ్` అనే స్పెషల్ ఫోర్స్ చేసే ప్రయత్నమే ఈ చిత్రం.