ఇంతముందెప్పుడూ నాగార్జునని మనం ఇలా చూడలేదు. ఎందుకంటే నాగార్జున తెలుగు సినీ మన్మథుడు. ఎప్పుడూ జోష్‌తో ఉంటాడాయన. అమ్మాయిల కలల రాకుమారుడు. ఇద్దరు కుమారులూ హీరోలుగా తెరంగేట్రం చేసేసినా నాగార్జున గ్లామర్ తగ్గలేదు. అందుకనే నాగార్జున 'అన్నమయ్య' సినిమా చేసినా, 'షిర్డీ సాయిబాబా' సినిమా చేసినా, ఆయనింకా సినీ మన్మథుడే. అయితే ఇప్పుడు నాగార్జున కొంచెం మారారు. ఆయన మాటలు, ఆయన బాడీ లాంగ్వేజ్ అన్నీ మారినట్లుగా కనిపిస్తున్నాయి. 'ఓం నమో వెంకటేశాయ' సినిమాతో నాగార్జునలో విపరీతమైన భక్తిభావం కనిపిస్తోంది. దానికి కారణం, 'ఓం నమో వెంకటేశాయ' చిత్రీకరణ సమయంలో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామితో పెంచుకున్న అనుబంధమేనట. వెంకటేశ్వరస్వామి గురించి తెలుసుకుంటూ తెలుసుకుంటూ తనకే తెలియని ఓ వింత భావనల్ని తనలో పెంచేసుకున్నానని నాగార్జున అంటున్నారు. అది నిజంగానే మహద్భాగ్యం. నాగార్జునలో కనిపిస్తున్న ఇంకో కొత్త కోణమేంటంటే, ఒకప్పటి ఆ పాత మధురాల్ని ఆయన గుర్తు చేసుకోవడం. అక్కినేని నాగేశ్వరరావు నటించిన పౌరాణిక చిత్రాల్ని గుర్తు చేసుకుంటూ, అలాంటి చిత్రాల్లో తన తండ్రి పోషించిన పాత్రల్ని, వాటి స్వభావాల్ని గురించి కూడా నాగార్జున వివరిస్తున్నారు. తద్వారా అలాంటి సినిమాల్లో ఇంకా ఇంకా నటించాలనే ఆకాంక్ష నాగార్జునలో కనిపిస్తోంది. ఏదేమైనా నాగార్జున చాలా మారిపోయారు. స్టార్‌డమ్‌ని ఎప్పుడో చూసేసిన నాగార్జున, నటన అనే మహాసముద్రంలో లోతుల్ని అన్వేషిస్తుండడాన్ని అభినందించాలి కదా.