తనపై ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ సంచలన ఆరోపణలు చేసిన మాజీ హీరోయిన్ తనూశ్రీదత్తా ఇప్పుడు నోటీసులతో ఉక్కిరిబిక్కిరవుతోంది.
నానా పటేకర్ ముందుగా ఆమెకు నోటీసులు జారీ చేయగా, ఆ తర్వాత మూవీ మేకర్ వివేక్ అగ్నిహోత్రి నుంచి కూడా తనూశ్రీదత్తాకి నోటీసులు అందడం గమనార్హం. లైంగిక వేధింపులకు సంబంధించి తనూశ్రీదత్తా పదేళ్ళ తర్వాత అయినా పెదవి విప్పడం ఆహ్వానించదగ్గ విషయమంటూ సెలబ్రిటలు ఆమెకు అండగా నిలుస్తున్నారు. వీరిలో కొందరు నానా పటేకర్ తీరు ఎప్పుడూ సరిగ్గా వుండేది కాదని ఆరోపిస్తోన్న సంగతి తెల్సిందే. అలాంటివారందరికీ నోటీసులు ఇవ్వాలని నానా పటేకర్ భావిస్తున్నాడట.
వాస్తవానికి నానా పటేకర్ కొన్ని విషయాల్లో వివాదాస్పద నటుడే అయినా, మహిళల విషయంలో ఆయన గౌరవభావంతో వుండేవాడనీ, పెర్‌ఫెక్షన్ విషయంలో మాత్రం రాజీ పడేవాడు కాదనీ కొందరంటారు. అదలా వుంటే తనూశ్రీదత్తా, నానా పటేకర్ తనను వేధింపులకు గురిచేశాడనే ఆరోపణల్ని నిరూపించేందుకు ఇప్పటికే ఓ వీడియో విడుదల చేయడం జరిగింది. అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అదొక్కటే తనూశ్రీదగ్గర వున్న ఆధారమా? లేదంటే ఇంకొన్ని ఆధారాలు వున్నాయా? అనేది తెలియాల్సి వుంది.
లైంగిక వేధింపుల వ్యవహారాలు బాలీవుడ్‌కి కొత్త కాదు. చాలామంది ఈ తరహా ఆరోపణలు చేశారు. వాటిల్లో కొన్ని పబ్లిసిటీ స్టంట్స్‌గానే నిలిచిపోయాయి. అయితే తనూశ్రీదత్తా విషయంలో మాత్రం 'వేధింపులు నిజమే అయి వుండొచ్చు' అన్న అభిప్రాయాలు అంతటా వ్యక్తమవుతున్నాయి. నోటీసులు అందుకున్నాక ఆ విషయమై తనూశ్రీదత్తా ఇంతవరకు స్పందించలేదు. ఆమె స్పందన కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు.