ఈ సంక్రాంతికి బాక్సాఫీసు దగ్గర గట్టి పోటే కనిపిస్తోంది. రజనీకాంత్, మహేష్‌బాబు, అల్లు అర్జున్, కల్యాణ్ రామ్ సినిమాలు విడుదల కానున్నాయి. పండగ సీజన్‌లో ఎన్ని సినిమాలొచ్చినా జనం చూడ్డానికి సిద్ధంగానే ఉంటారు. కాకపోతే కావల్సిన సంఖ్యలో థియేటర్లు దొరుకుతాయా? లేదా? అనేదే ప్రధాన సమస్య. 9న విడుదల కాబోతున్న దర్బార్‌కి థియేటర్లు దొరకడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. సరిలేరు నీకెవ్వరు సినిమా వెనుక దిల్‌రాజు అండగా ఉన్నాడు. కాబట్టి... ఆ సినిమాకి థియేటర్ల సమస్య ఉండదు. బన్నీ సినిమా వెనుక అల్లు అరవింద్ ఉన్నాడు. కాబట్టి ఆ సినిమాకీ సమస్య లేదు. ఇప్పుడు ఎటు చూసినా కల్యాణ్ రామ్ సినిమా `ఎంత మంచి వాడవురా`కే ఇబ్బంది.
మహేష్, బన్నీ, రజనీ పంచుకోగా మిగిలిన థియేటర్లు కల్యాణ్‌రామ్‌కి వస్తాయి. ప్రధాన నగరాల్లోని ముఖ్యమైన థియేటర్లేవీ కల్యాణ్‌రామ్ కి దొరకవు. కానీ ఆఖర్లో రావడం వెనుక ఓ ప్లస్ పాయింటూ ఉంటుంది. మూడు సినిమాల పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటే, తప్పకుండా ఆ సినిమాలు థియేటర్ల సంఖ్యని తగ్గించుకుంటాయి. అవన్నీ కల్యాణ్‌రామ్‌కి దొరికేస్తాయి. అన్నింటికంటే ముఖ్యమైన పాయింటేమిటంటే - మిగిలిన సినిమాలతో పోలిస్తే కల్యాణ్ రామ్‌ది చిన్న సినిమానే అనుకోవాలి. అలాంటప్పుడు థియేటర్లు తగ్గినా పెద్ద బాధేం ఉండదు. మెల్లగా పికప్ అయ్యే ఛాన్సుంటుంది. మూడు సినిమాలూ ఇరగాడేస్తే మాత్రం - చివర్లో వచ్చిన ఈ మంచివాడ్ని ఎవ్వరూ పట్టించుకోరు. ఆ ప్రమాదం ఉంది.