టాలీవుడ్లో కొత్త ఒరవడి జోరందుకుంది. కొత్త కథల వైపు, ప్రయోగాత్మక చిత్రాల వైపు స్టార్ హీరోలు కూడా మొగ్గు చూపుతున్నారు. కొత్తదనాన్ని పరిచయం చేయడంతో పాటు, సక్సెస్ కూడా అందుకుంటున్నారు. అలాగే విమర్శకుల ప్రశంసలు కూడా దక్కుతున్నాయి కొన్ని సినిమాలకు. అందుకే నందమూరి బుల్లోడు కళ్యాణ్‌రామ్ కూడా ప్రయోగాల బాట పట్టాడు.
ఇటీవలే 'ఎమ్మెల్యే' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి, ఫర్వాలేదనిపించాడు. త్వరలోనే 'నా నువ్వే' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ లోగా మరో కొత్త ప్రాజెక్ట్‌కి పచ్చ జెండా ఊపేశాడు. అదే గుహన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ గుహన్ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న చిత్రమిది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఇంతవరకూ ఇలాంటి చిత్రాల్లో కల్యాణ్‌రామ్ నటించింది లేదు. తొలిసారిగా ఈ తరహా జోనర్‌ని టచ్ చేస్తున్నాడు కళ్యాణ్‌రామ్.
తాజాగా ఈ చిత్రం ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ విచ్చేశారు. అన్నయ్య చేయబోతున్న ఈ ప్రయోగం ఫలించాలని మనస్పూర్తిగా కోరుకున్నాడు. ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్‌కి జోడీగా ఇద్దరు ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. ఎన్టీఆర్‌తో 'జై లవకుశ'లో జోడీ కట్టిన నివేదా థామస్, 'అర్జున్‌రెడ్డి' ఫేం షాలినీ పాండే ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్ నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మే 2 నుండి జరగనుంది.