ప్రైవేటు అవార్డులు ఎన్ని వచ్చినా - ప్రభుత్వం ఇచ్చే అవార్డులకు ఉన్న గుర్తింపే వేరు. అందుకే... నంది అవార్డులంటే సినీ పరిశ్రమకు అంత గురి. తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తరవాత.. నంది ముచ్చట లేనేలేదు. అవార్డులు ప్రకటించినా ఇప్పటి వరకూ... ప్రదానం కూడా చేయలేదు. ప్రభుత్వం మారింది గానీ, నంది అవార్డుల ప్రస్తావన అలానే ఉంది. ఎట్టకేలకు ఇది వరకు ప్రకటించిన నంది అవార్డులు ఇవ్వడానికీ, కొత్త అవార్డులు ప్రకటించడానికీ ఏపీ ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించిందని సమాచారం.
ఇటీవల చిరంజీవి, జగన్ ల మధ్య జరిగిన భేటీలో నంది అవార్డుల గురించి ప్రస్తావన కూడా వచ్చిందని సమాచారం. నంది అవార్డులు ఇస్తే బాగుంటుందని జగన్‌ని చిరు కోరారట. దానికి జగన్ కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. వెంటనే.. నంది అవార్డు ప్రక్రియ మొదలెడతామని మాటిచ్చార్ట. సో.. ఇక నందుల హంగామా మొదలైపోయినట్టే. ఇటు తెలంగాణలో సింహా అవార్డులు ఇస్తామని ఎప్పుడో చెప్పారు. కానీ.. అలాంటి ప్రయత్నాలేం జరగలేదు. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెడితే బాగుంటుందేమో.