నేచురల్ స్టార్ నాని ఏడాదికి మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉండేవాడు. కానీ, వరుస పరాజయాలు రావడంతో, కాస్త డీలా పడిన నాని, ఈ ఏడాది 'జెర్సీ'తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన 'గ్యాంగ్ లీడర్'కీ పోజిటివ్ టాక్ రావడంతో, మళ్లీ నాని కెరీర్ ట్రాక్ ఎక్కేసింది. దాంతో వరుస సినిమాలు ఓకే చేసుకుంటూ పోతున్నాడు. ఫెయిల్యూర్స్ రావడంతో, కొంచెం స్లోగా ఆచి తూచి కథల్ని ఎంచుకోవాలనుకున్న నాని, ఇప్పుడు ఇదివరకటి స్ట్రాటజీనే ఫాలో చేస్తున్నాడు. వరుసగా కథల్ని ఓకే చేస్తున్నాడు.
ప్రస్తుతం నాని తనకు సినీ గురువుగా భావించే ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో 'వి' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాని విలన్ రోల్ పోషిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే, మరో రెండు ప్రాజెక్టులూ లైన్లో పెట్టేశాడు. తాజాగా యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్కి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ 'ట్యాక్సీవాలా'తో హిట్ కొట్టిన దర్శకుడు రాహుల్ సాంకృత్యన్. ఆయన చెప్పిన ఓ డిఫరెంట్ స్టోరీ లైన్ నానికి బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడట. అలా నాని లిస్టులో రాహుల్ సాంక్రృత్యన్ జాయిన్ అయిపోయాడు. మరోవైపు తన సొంత బ్యానర్ వాల్ పోస్టర్ ఎంటర్టైన్మెంట్స్పై 'అ' చిత్రం తర్వాత మరో విలక్షణ చిత్రాన్ని నిర్మించేందుకు రెడీ అయిపోయాడు. అన్నట్లు 'నిన్ను కోరి', 'మజిలీ' చిత్రాల దర్శకుడు శివ నిర్వాణతో నాని ఓ సినిమా చేయాల్సి ఉంది.