'గ్యాంగ్‌లీడర్'తో నాని సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాను అంతకు ముందే ఫిక్స్ చేసుకున్న ఆగస్ట్ 30 రిలీజ్ డేట్‌ని 'సాహో' కోసం త్యాగం చేసి, 'సాహో'ని 'మన సినిమా'. ఖచ్చితంగా విజయం సాధించాలి అని కోరుకుని, డార్లింగ్ ఫ్యాన్స్ మనసు దోచేశాడు. ప్రబాస్ ఫ్యాన్స్‌లో నాని పట్ల పోజిటివిటీ ఏర్పడిపోయింది ఈ ఒక్క మాటతో. ఇక మెగా ఫ్యాన్స్‌కి కూడా నాని బాగానే గాలమేసేశాడు.
'గ్యాంగ్ లీడర్' ట్రైలర్‌లో చిరంజీవిని బాగా వాడేశాడు. ఒక సీన్‌లో చిరంజీవి మాస్క్ వేసుకుని కనిపించాడు. అలాగే మెగాస్టార్ వెల్డింగ్ చేస్తూ కనిపించే సీన్‌ని తన సినిమా కోసం వాడేసి, ఆ పోస్టర్‌ని చిరంజీవి బర్త్‌డే రోజు రిలీజ్ చేసి, ఆయనకు స్పెషల్‌గా బర్త్‌డే విషెస్ చెప్పి, అక్కడ కూడా మార్కులు కొట్టేశాడు. ఇలా నాని ఇటు మెగా అభిమానులకూ, అటు ప్రబాస్ అభిమానులకూ బాగానే బిస్కెట్లేశాడు. ఇక అదే రోజు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'వాల్మీకి' చిత్రం కూడా విడుదల కావల్సి ఉంది.
కానీ, నాని కోసం 'వాల్మీకి' యూనిట్ వెనక్కి తగ్గడంతో, మెగా ఫ్యామిలీ సపోర్ట్ కూడా దక్కింది. ఇక అన్ని వైపుల నుండీ నానీస్ 'గ్యాంగ్‌లీడర్'కి లైన్ క్లియర్ అయిపోయింది. కంటెంట్ పరంగా నాని 'గ్యాంగ్‌లీడర్'తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి మరి. దర్శకుడు విక్రమ్ కుమార్‌ని అంత తక్కువగా అంచనా వేయడానికి లేదు. 'హలో' ఫ్లాప్ తర్వాత విక్రమ్, హిట్టు కొట్టాలని కసిగా తీసిన సినిమా ఇది. కాన్సెప్ట్ కొత్తగా ఉంది. కనెక్టింగ్ ఎలా ఉందనేది తెలియాలంటే సెప్టెంబర్ 13 వరకూ ఆగాల్సిందే.