2016 - హ్యాట్రిక్‌ హీరో నేచురల్‌ స్టార్‌

మరిన్ని వార్తలు

నాని అంటే నాచురల్‌ స్టార్‌. మన పక్కింటి కుర్రాడే, మనలో ఒకడిలా ఉంటాడు. అదే అతని ప్రత్యేకత. ఏ సినిమా చేసినా, హండ్రెడ్‌ పర్సెంట్‌ ఎఫెర్ట్‌ పెట్టడం నానికే చెల్లుతుందేమో. కథల ఎంపికలోనూ నాని తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. అదే నానిని మిగతా హీరోలతో పోల్చితే డిఫరెంట్‌ హీరోని చేసింది. చిన్న సినిమాలకు చాలా పెద్ద హీరో నాని. ఈ తరహా సినిమాలకి నాని తప్ప, ఇంకో ఆప్షన్‌ని ఊహించుకోలేం. 'కృష్ణగాడి వీర ప్రేమగాధ', 'జెంటిల్‌మెన్‌', 'మజ్ఞు' ఇలా మూడు సినిమాలతో వరుస సక్సెస్‌లు అందుకున్న నాని, 2016లో హ్యాట్రిక్‌ హీరో అనిపించుకున్నాడు. సినిమా సినిమాకి తనలో మెచ్యూరిటీ లెవల్స్‌ని పెంచుకుంటూ వెళుతున్నాడు. విభిన్నమైన కథాంశంతో ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం పరితపిస్తున్న యంగ్‌ హీరో నితిన్‌, 'హ్యాట్రిక్‌ హీరో ఆఫ్‌ 2016' అనే గుర్తింపుకి నూటికి నూరుపాళ్ళూ అర్హుడు. 


కృష్ణగాడి వీర ప్రేమగాధ 


హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చింది ఈ సినిమా. ఇందులో బాలకృష్ణ అభిమానిగా కనిపిస్తాడు. అయితే అది జస్ట్‌ ఓ సీన్‌కే పరిమితం. పిరికివాడైన ఓ ప్రేమికుడు, తన ప్రేమ కోసం ఎంత పెద్ద సాహసం చేశాడన్నదే ఈ చిత్ర కథ. చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవారిని, అలాగే క్లాస్‌ - మాస్‌ ఇలా అందరినీ ఆకట్టుకున్న చిత్రమిది. పాటలు, పాటలకు మించిన పోరాట సన్నివేశాలు, వీటన్నిటికీ మించిన విజువల్స్‌ ఈ సినిమాకి బాగా కుదిరాయి. నాని సరసన మెహరీన్‌ కౌర్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. 


జెంటిల్‌మెన్‌ 


ఇదొక విలక్షణమైన చిత్రం. రొటీన్‌ సినిమాలకు చాలా చాలా భిన్నమైన సినిమా. హీరోగా సత్తా చాటడమే కాదు, నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలోనూ అలరించగలనని నాని నిరూపించుకున్నాడు. సురభి, నివేదా థామస్‌ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ సినిమా, 2016లో వచ్చిన విలక్షణ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. నానితో అష్టాచెమ్మా' అనే ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కించిన ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. 


మజ్ఞు 


నాని మార్క్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. లవ్‌ స్టోరీస్‌లో నాని చేసిన సినిమాలు వెరీ వెరీ స్పెషల్‌గా ఉంటాయి. నాని సరసన అను ఇమ్మాన్యుయేల్‌, నందిత శ్వేత ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. ఇద్దరూ ఇద్దరే. ఈ ఇద్దరిలోనూ అను ఇమ్మాన్యుయేల్‌కి 'మజ్ఞు' తర్వాత ఆఫర్లు వెల్లువలా వచ్చిపడ్డాయి. ఉయ్యాల జంపాల ఫేం విరించి వర్మ ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించాడు. 


పై మూడు సినిమాలూ దేనికదే అన్నట్లుగా ఉంటాయి. ఒకదానితో ఒకటి పోల్చి చూస్తే పూర్తి భిన్నమైన చిత్రాలుగా చెప్పవచ్చు. అన్నిట్లోనూ నాని పెర్ఫామెన్స్‌ హైలైట్‌. నాని స్టార్‌డమ్‌, కథల్లో కొత్తదనం వెరసి ఈ ఏడాదిలో మూడు సినిమాలూ ఘనవిజయం సాధించాయి. తద్వారా నాని 2016లో హ్యాట్రిక్‌ హీరో అయ్యాడు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS