నాని కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. హీరోగా చేసినప్పటింటే, నిర్మాతగా మారిన తరవాత మరింత అప్రమత్తమైపోయాడు. ఆ, హిట్ లాంటి విజయాలు నిర్మాతగా నాని ఖాతాలో ఉన్నాయి. చేసిన రెండు ప్రయత్నాలూ ఫలించాయి. అయితే.... తొలిసారి ఓటీటీలో అడుగుపెట్టి తీసిన `మీట్ - క్యూట్` మాత్రం ఫట్‌మంది. ఐదు కథల ఆంథాలజీ ఇది. నాని సోదరి దీప్తి గంటా దర్శకురాలిగా పరిచయం అయ్యింది. నాని నిర్మాత కావడం.. సత్యరాజ్, రోహిణి, ఆదాశర్మలాంటి ఆర్టిస్టులు ఉండడంతో... ఈ వెబ్ సిరీస్‌పై ఆసక్తి పెరిగింది. అయితే.. ఈనెల 25న వచ్చిన ఈ వెబ్ సిరీస్... దారుణంగా పల్టీకొట్టింది. ఐదు కథల్లో ఒక్కదానికీ జీవం లేదు. కనీసం కథ అనే ఫార్మెట్‌లో కూడా లేదు. ఓ ప్రారంభం, ఓ ట్విస్ట్, ఓ ముగింపు.. ఇలా ఉండాలి కదా? ఆ లక్షణాలేం.. ఈ కథల్లో కనిపించలేదు. ఒకటి కాకపోతే, ఇంకోటైనా బాగుంటుందని అంతా భావించారు. కానీ... పేజీల పేజీల డైలాగులు తప్ప, విజువల్ బ్యూటీ కనిపించలేదు. దాంతో... ఓటీటీలో ఈమధ్య వచ్చిన సిరీస్‌లలో.. ఇదే చెత్త రేంటింగులు సంపాదించుకొంది.
నాని జడ్జిమెంట్ `మీట్ - క్యూట్` విషయంలో తప్పిందన్న విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పొచ్చు. నిర్మాతగా తన నుంచి రాకూడని ప్రాడెక్టు ఇది. బహుశా.. అక్క సెంటిమెంట్ కి పడిపోయి ఉంటాడు. అయితే ఈ వెబ్ సిరీస్ వల్ల నాని నష్టపోయాడా, లాభ పడ్డాడా? అనేది ఇప్పుడే చెప్పలేం. సోనీ లైవ్ సంస్థ ఈ వెబ్ సిరీస్ హక్కుల్ని చేజిక్కించుకొంది. అయిన బడ్జెట్, వచ్చిన రాబడి.. వీటి మధ్య పొంతన ఉందా, లేదా? అనేది చూడాలి.